కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. వరి ధాన్యం, పత్తి చేతికొస్తున్న సమయంలో సర్కారు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించింది. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు అమ్ముకుంటుండగా, వారు ఇదే అదనుగా భావించి అందినకాడికి దండుకోవడం పరిపాటిగా మారింది.
జిల్లాలో ఈ ఏడాది 3.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగైనట్లు తెలుస్తుండగా, 23 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని యంత్రాంగం అంచనా వేస్తున్నది. ప్రస్తుతం పత్తి తీత మొదలైంది. జిల్లాలోని ఆసిఫాబాద్, జైనూర్, కాగజ్‌నగర్‌లలో 17 జిన్నింగ్ మిల్లులు ఉండగా, ఒక్క ఆసిఫాబాద్‌లోని జిన్నింగ్ మిల్లులో తప్ప ఎక్కడా కొనుగోళ్లు ప్రారంభించలేదు. పత్తి కొనుగోళ్లు చేస్తామని మార్కెటింగ్‌శాఖ అధికారులు ప్రకటించి పది రోజులు గడుస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సీసీఐ కొనుగోళ్లు ఆలస్యమవుతుండగా, ఇక ఇదే అదనుగా భావించిన దళారులు పల్లెల్లో దుకాణాలు తెరచి సేకరణ మొదలు పెట్టారు.
రైతులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తుండగా, దీనిని అవకాశంగా భావించి తక్కువ ధరకు కొనుగోళ్లు చేపడుతూ నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ. 7521 ధర నిర్ణయించగా, దళారులు మాత్రం రూ. 6 వేల నుంచి రూ. 6500 వరకే చెల్లిస్తున్నారు. దీంతో రైతులు రూ. వెయ్యి నుంచి రూ. 1500 వరకు నష్టపోతున్నారు. ఇటు దిగుబడులు సరిగా రాక.. అటు మద్దతు ధర లభించక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.
జిల్లాలో 59,212 ఎకరాల్లో వరి సాగయ్యింది. సుమారు 57 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది 34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్కచోట కూడా కొనుగోళ్లు ప్రారంభించలేదు. పలుమార్లు సమీక్షలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకుండా పోతున్నది. రైతులు ధాన్యాన్ని తీసుకొస్తూ ఇండ్లు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఒకవేళ వర్షం వస్తే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఇక ఇక సన్నరకం వరిధాన్యానికి ప్రభుత్వం ఇచ్చే రూ. 500 బోనస్‌పై రైతుల్లో సందేహం మొదలైంది.
ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బోనస్ ఇస్తారా.. లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయని అధికారులు.. ఇక సన్నవడ్ల సేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఏ-గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ. 2,320, సాధారణ రకానికి 2,300 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అలసత్వం కారణంగా రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురిస్తున్నది.