కాగజ్ నగర్ : కుమురంభీం టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జీవో ( Tiger Conservation Reserve) ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ( MLA Palvai Harish Babu ) డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఏక పక్షంగా, ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.49 ను తీసుకువచ్చిందని ఆరోపించారు.
జీవో వల్ల జిల్లాలోని రైతులకు, గిరిజనులకు, గిరిజనేతరులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని దాదాపు 4 లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించడంతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడి, ప్రజలు తిరగలేని పరిస్థితి దాపురిస్తుందని తెలిపారు. ఇప్పటికే పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్లకు కనీసం మరమ్మతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇంకా కన్జర్వేషన్ రిజర్వు పేరిట అటవీ అనుమతులు వచ్చే పరిస్థితి ఉండదని విమర్శించారు.
గ్రామాల్లో సీసీ రోడ్లు వేయలేని పరిస్థితి వచ్చిందని, తాగునీటికి బోరింగ్లు వేయనీయకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఇక టైగర్ కన్జర్వేషన్ రిజర్వు పేరిట అటవీ అధికారులు పెట్రేగి పోయి ప్రజల మాన ప్రాణాలతో చెలగాటం ఆడటం జరుగుతుందని ఆరోపించారు. జీవో నంబర్ 49పై ఆదివాసీ సంఘాలు ఆందోళన చేస్తుంటే, కనీసం మాట మాత్రం కూడా గిరిజన ఇన్చార్జి మంత్రి సీతక్క మాట మాత్రం స్పందించక పోవడం అన్యాయమన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసి అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రేపటి నుంచి బీజేపీ ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయాల ఎదుట జీవో నం.49 ప్రతులను దహనం చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, పట్టణ అధ్యక్షులు శివ, మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, మండల అధ్యక్షులు పుల్ల అశోక్, మాజీ ఎంపీటీసీ గణపతి, తిరుపతి, గజ్జల లక్ష్మణ్, తిరుపతి గౌడ్, మహేష్, చిలుకయ్య తదితరులు పాల్గొన్నారు.