మంచిర్యాల, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రూ. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామంటూ చెప్పుకొచ్చిన సర్కారు.. చివరకు అనేక మంది కర్షకులకు రిక్త‘హస్తం’చూపించింది. రేషన్ కార్డులు లేవని.. రుణం ఎక్కువ ఉందని.. ఇలా ఏవేవో కారణాలు చెప్పి.. సర్వే చేపట్టి కాలయాపన చేసింది. ఇక చివరకు రుణమాఫీ 100 శాతం పూర్తయ్యిందని చేతులెత్తేసింది. అన్ని అర్హతలున్నా తమకు రుణం మాఫీ కాలేదని.. ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే విడుతల వారీగా రూ. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆగస్టులో మూడో విడుత విడుదల చేసింది. ఇందులో అనేక మంది అర్హులకు రుణమాఫీ కాకపోవడంతో వారంతా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. దీంతో స్పందించిన సర్కారు రేషన్ కార్డు లేని వారికి. రూ. రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నవారికి రుణం మాఫీ కాలేదని.. రూ. రెండు లక్షలకు పైగా రుణం ఉన్నవారు& మిగతా డబ్బు కట్టాలని స్పష్టం చేసింది. ఆపై రేషన్ కార్డులు లేని వారి కోసమంటూ కుటుంబ నిర్ధారణ సర్వే మొదలు పెట్టింది. మూడు నెలల పాటు కాలయాపన చేసింది. ఇక చివరకు ఇటీవల నాలుగో విడుత రుణమాఫీ (100 శాతం) పూర్తయ్యిందని ప్రకటించింది. అన్ని అర్హతలున్నా తమకు రుణమాఫీ కాలేదని.. సర్వే పేరిట సర్కారు తమను మోసం చేసిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సర్వే చేసినా సగం మందికి రాలే..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేషన్ కార్డు (కుటుంబ నిర్ధారణ) లేక వేలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఆదిలాబాద్ జిల్లాలో 18,000, నిర్మల్ జిల్లాలో 13,433 మంది రైతులు, మంచిర్యాల జిల్లాలో 15,542 మంది రైతులకు కుటుంబ నిర్ధారణ లేక రుణమాఫీ కాలేదు. కాగా, ఆదిలాబాద్ జిల్లాలో 6,600 మందికి, నిర్మల్ జిల్లాలో 6,823 మందికి, మంచిర్యాల జిల్లాలో 8,195 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. అంటే ఈ లెక్కన రుణమాఫీ అవుతుందని ఆశపడి, రైతు వేదికల చుట్టూ, గ్రామ పంచాయతీల చుట్టూ తిరిగి మరీ సర్వే చేయించుకున్న సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు. అలాంటప్పుడు సర్వే ఎందుకు చేశారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డు లేదనే కారణంతో నాలుగో విడుత పూర్తయ్యాక కూడా రుణమాఫీ కాని రైతులు ఎంతో మంది ఉన్నారని వాపోతున్నారు. రూ.రెండు లక్షల లోపు రుణం ఉండాలని చెప్పడంతో.. అంతకు మించి ఉన్న రైతులు ఆ డబ్బు కట్టినా కూడా రుణమాఫీ కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
కారణాలెన్నో..
సర్వేలో పాల్గొన్న కుటుంబాలకు రుణమాఫీ ఎందుకు కాలేదంటే అధికారులు ఎన్నో కారణాలు చెబుతున్నారు. “రేషన్ కార్డు లేని రైతులు కుటుంబాలపై సర్వే చేశాం. ఆధార్‌కార్డు నంబర్ల ఆధారంగా వివరాలు తీసుకొని ఆన్లైన్లో నమోదు చేశాం. రేషన్‌కార్డులో ఉన్న తప్పులు కాకుండా బ్యాంక్ పాస్‌బుక్‌లలో ఉన్న తప్పులను బ్యాంక్ వాళ్లే సరిచేశారు. అలాంటి వారికి రుణమాఫీ అయ్యింది. సర్వేలో పాల్గొన్నక కూడా రుణమాఫీ కాలేదంటే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో ఆ కుటుంబాలోఉండి ఉండాలి. లేదా రూ. రెండు లక్షల కంటే ఎక్కువ రుణం ఉండి ఉండాలి. ఈ రెండు కాకపోతే లోన్ రెన్యూవల్ చేయక మూడేళ్లు దాటి ఉండాలి. ఇలాంటి రైతులకే రుణమాఫీ కాలేదు’ అని అధికారులు అంటున్నారు. మరి అన్ని అర్హతలు ఉండీ మాఫీ కాని వారు ఏం చేయాలి అంటే మాత్రం అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. ఈ నేపథ్యంలో రుణమాఫీ కాని రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నా మాఫీ కాలేదంటూ గోడు వెల్లబోసుకుంటున్నారు.
బ్యాంకుల చుట్టూ తిరిగిన
లింగాపూర్, డిసెంబర్ 3 : మా ఊరిలో నాకు మూడెకరాల భూమి ఉంది. దాని మీద రూ. 2.13 లక్షల రుణం తీసుకున్న. యేటా రెన్యూవల్ చేస్తున్న. రుణమాఫీ చేస్తరని ఎంతో ఆశతో ఎదురు చూసిన. ఇప్పటి వరకు కాలే. బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగీ యాష్టకు వచ్చిన. అన్ని అర్హతలున్నా రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులను గోస పెట్టుకునుడు మంచిది కాదు. ఇకనైనా న్యాయం చేయాలె.
– చవాన్ సోరాజీ, గోపాల్పూర్
సాకులు చెప్పడం సరికాదు
తిర్యాణి, అక్టోబర్ 3 : మా ఊరిలో నా పేరున ఐదెకరాలు, నా భార్య పేరు మీద రెండెకరాల భూమి ఉంది. నేను రూ. 2 లక్షలు, నా భార్య రూ. లక్ష రుణం తీసుకున్నం. ఇప్పటి వరకు రుణం మాఫీ కాలే. కేసీఆర్ సర్కారు చెప్పినట్లుగానే రైతులందరికీ రుణాలు మాఫీ చేసింది. కానీ కాంగ్రెసోళ్లు ఇట్లా గోస పెట్టుడు మంచిది కాదు. ఎన్నికలప్పుడేమో రుణాలన్నీ మాఫీ చేస్తమని చెప్పిన్రు. ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత ఇలా సాకులు చెప్పడం సరికాదు. కష్టకాలంలో ఉన్నం. మాకు రుణాలు మాఫీ చేసి ఆదుకోవలి. – వెడ్మ భగవంతరావు, రైతు, కన్నేపల్లి
వడ్డీ, ఆసలు కట్టినా లోన్ మాఫీ కాలేదు
నెన్నెల, డిసెంబర్ 3 : నాకు మా ఊరిలో ఉన్న భూమి మీద ఆవుడం తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో రూ.1.90 లక్షల రుణం తీసుకున్న. వడ్డీతో కలిపి రూ.2.15 లక్షలు అయ్యింది. వడ్డీతో పాటు కొంత అసలు కలిపి రూ.25 వేలు కట్టాను. ఇగ బ్యాంక్‌లో రూ.2 లక్షల లోపు పంట రుణమే ఉంది. కానీ నాలుగో విడుతలో కూడా నాకు రుణమాఫీ కాలే. మా కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికి కూడా పంట రుణం లేదు. నాకు రేషన్ కార్డు కూడా ఉంది. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ఇట్లా మాట తప్పి మోసం చేయడం సరికాదు.
– చిలారపు సంతోష్, చిత్తాపూర్