ఎదులాపురం, డిసెంబర్ 28 : ఆదిలాబాద్ మట్కా రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. పోలీస్ హెడ్కార్వర్టర్స్లోని సమావేశ మందిరంలో బుధవారం ఏర్పాటు చేసి సమావేశంలో జిల్లా వార్షిక నేర నివేదిక వివరాలను వెల్లడించారు. గతేడాదితో పొల్చుకుంటే ఈ ఏడాది కొన్నిటిలో హెచ్చుతగ్గులున్నాయన్నారు. మొత్తం మీద జిల్లాలో నేరాలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈ ఏడాది న్యాయస్థానంలో నేరస్తులకు శిక్షల శాతం గణనీయంగా పెరిగిందన్నారు. న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాదులు కృషి ఎంతగానో ఉన్నదని, వారిని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ముస్కు రమణారెడ్డి, సంజయ్వైరాగరె, మేకల మధూకర్, దేవేందర్‌ను పుష్పగుచ్ఛం అందించి అభినందించారు.
జిల్లా వ్యాప్తంగా పూర్తిగా రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే కొత్త సంవత్సరం లక్ష్యంగా జిల్లా పోలీసు వ్యవస్థ నిరంతరం కృషిచేస్తుందన్నారు. అలాగే జిల్లాలో వందశాతం మాట్కా నిర్మూలన సాధిస్తామని తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో వివిధ నేరాలపై 3,231 నమోదైన కేసులు నమోదైనట్లు వెల్లడించారు. అందులో కోర్టులో 41, న్యాయస్థానంలో పోలీసు కేసులు రుజువైనవి 721, హత్య కేసులు 10, లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినవి 1,112, మహిళలపై నేరాలకు సంబంధించి 278, బాలికలపై జరిగిన నేరాలకు సంబంధించి 35 కేసులు ఉన్నట్లు వివరించారు. అలాగే గంజాయికి సంబంధించి 18 కేసుల్లో 28 మందిపై కేసు నమోదవగా, 32 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
265 రోడ్డు ప్రమాదాల్లో 140 మరణాలు సంభవించగా, 201 మంది గాయపడ్డారన్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రెవ్కు సంబంధించి 5,443, ఆర్థిక నేరాలుకు సంబంధించి 173 కేసులు నమోదైనట్లు తెలిపారు. పేకాటకు సంబంధించి 118 కేసుల్లో 680 వ్యక్తులు, రూ. 20,09,230 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అలాగే ఐదు వైద్యశిబిరాలు, వెయ్యి మంది గిరిజనులకు ఉచితంగా బ్లాంకెట్లు పంపిణీ చేసినట్లు వివరించారు.
530 మంది పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు ఉచితంగా ప్రిలిమినరీ పరీక్షకు శిక్షణ ఇచ్చినట్లు, అందులో 300 మంది అర్హత సాధించారని వెల్లడించారు. 14 సేవా పథకాలు, 2 ఉత్కృష్ట సేవా పథకాలు, 8 మేజర్ సర్వీస్ ఎంట్రీ రివార్డులు, 1709 గుడ్ సర్వీస్ ఎంట్రీ రివార్డులు, 307 నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలతో సిబ్బందికి తగిన ప్రోత్సాహం అందినట్లు వివరించారు. ఆపరేషన్ ముస్కాన్, స్మైల్‌లో 96 మంది బాలలను గుర్తించి, వారిని తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ డీ శ్రీనివాసరావు, డీఎస్పీ వీ ఉమేందర్ పాల్గొన్నారు.