చెన్నూర్‌ను జాతీయ స్థాయిలో నంబర్ వన్‌గా నిలుపుతున్న పట్టుగూళ్ల పెంపకాన్ని అటవీ శాఖ అడ్డుకుంటున్నది. రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలోని గిరిజనులను అడవికి దూరం చేస్తూ కుట్ర జరుగుతున్నది. తాత.. ముత్తాతల కాలం నుంచి పట్టు సాగు చేస్తున్న అడవిబిడ్డల పొట్టగొట్టాలని చూస్తుండగా, అధికార పార్టీ పట్టనట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
– మంచిర్యాల, (నమస్తే తెలంగాణ ప్రతినిధి), అక్టోబర్ 5
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం, కావరకొత్తపల్లి, ఎదుల్లబంధం, లింగన్నపేట, నాగంపేట, బొప్పారం గ్రామాలకు చెందిన సుమారు 750 కుటుంబాలకు పట్టుగూళ్ల సాగే జీవనాధారం. ఈ ప్రాంతంలో నల్లమద్ది చెట్లు సమృద్ధిగా ఉండడంతో గిరిజన రైతులు పట్టుపురుగుల పెంపకాన్ని చేపడుతున్నారు. చిన్న పురుగు నుంచి పట్టుకాయలు తయారయ్యే వరకూ కంటికి రెప్పలా కాపాడుతుంటారు. గిరి కుటుంబాలు 60 ఏళ్లుగా ఈ పంటను సాగు చేస్తుండగా, అటవీశాఖ అధికారులు వారిని అడ్డుకోవడం వివాదానికి దారితీస్తున్నది. ప్రాణహిత వన్యప్రాణి అభయారణ్యంలో పట్టుపురుగుల పెంపకం నిషేధమని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ గిరిజనులకు అడ్డుకుంటున్నారు.
పట్టుగూళ్ల పెంపకానికి అటవీ శాఖ ఆంక్షలు విధిస్తుండడం వల్ల ఆదివాసీలు అడవికి దూరమయ్యే ప్రమాదమున్నది. ఇక్కడి గిరిజనులు పట్టుగూళ్ల పెంపకం ద్వారా చెన్నూర్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన విషయం విదితమే. రాష్ట్రంలో భద్రాచలం, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పట్టుగూళ్లు సాగు చేస్తున్నారు. కానీ, మంచిర్యాల జిల్లాలో సాగవుతున్న పట్టుగూళ్లకు జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంటుంది. పొరుగు జిల్లాల వ్యాపారులు చెన్నూర్‌లో జరిగే పట్టుగూళ్ల వేలం పాటలో పాల్గొంటుంటారు.
మంత్రి వివేక్ ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నూర్ నియోజకవర్గంలో గిరిజనులకు తీవ్ర అన్యా యం జరుగుతోంది. యేటా మూడు పంటలు తీస్తూ పొట్టపోసుకుంటున్న గిరిజనులను అటవీ అధికారులు ఆంక్షల పేరిట అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఇప్పటికే అటవీ అధికారులు జాతీయ రహదారిపై టోల్గేట్ ప్రారంభించి వాహనదారుల జేబులు గుళ్ల చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. తాజాగా గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై మంత్రి నోరుమెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పాలనలోనే కష్టాలు మొదలయ్యాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా ఆందోళన బాట పడుతున్నా మంత్రి మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.
అడవికి దూరం చేసే కుట్రలు జరుగుతుండడంతో గిరిజనులు ఉద్యమబాట పట్టారు. తామెప్పుడూ అటవీ సంపదను నాశనం చేయలేదని, వన్యప్రాణులకు హాని చేయలేదని, వనాన్ని రక్షిస్తూ ఉపాధి పొందుతున్న తమపై అటవీ శాఖ ఆంక్షలు పెట్టడం సరికాదని, 60 ఏండ్లలో ఏనాడూ అటవీ అధికారులు తమకు అడ్డుతగలలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధికి దూరం కావాల్సిన పరిస్థితి వస్తే దశలవారీగా పోరాటం చేస్తామంటూ వారు హెచ్చరిస్తున్నారు.
బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్, మండల నాయకులు తిరుపతిరావు నేతృత్వంలో నాయకులు గిరిజనులకు మద్దతు తెలుపుతున్నారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి గిరిజనులకు పట్టుగూళ్ల పెంపకానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. మంత్రి వివేక్ నియోజకవర్గంలో గిరిజన కుటుంబాలకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా మంత్రి వివేక్‌కు తెలిసే జరుగుతుందని, అటవీ అధికారులు జాతీయ రహదారిపై టోల్ గేట్ ఏర్పాటు చేసి వాహనదారుల జేబులు కొల్లగొడుతున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా మంత్రి జోక్యం చేసుకొని గిరిజనులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మా గిరిజన కుటుంబాలకు పట్టుగూళ్ల సాగే జీవనా ధారం. తరతరాలుగా సాగు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నం. ఇప్పుడు అటవీ అధికారులు వచ్చి వెళ్లిపొమ్మంటే ఎక్కడికి పోవాలి. అడవికి ఇన్నాళ్లు జరగని నష్టం ఇప్పుడెట్లా జరుగుతుందో అర్థం కావడం లేదు. మేం అడవుల్లో ఉండవట్టే అటవీ సంపద పదిలంగా ఉంటుంది. అధికారులు మాకు ఉపాధి లేకుండా చేయాలని చూడడం దారుణం.
– ఆలం రామయ్య, పట్టుగూళ్ల సాగు రైతు
ఏండ్లకేండ్లుగా పట్టుగూళ్లు సాగు చేసుకుంటు న్నం. ఇప్పుడు ఫారె స్టోళ్లు వచ్చి వద్దంటు న్నరు. ఎక్కడికి పోయేది. మాకు దిక్కెవరు. అడవిలో పుట్టి, అడవినే నమ్ము కొని బతుకుతున్నం. మా పొట్టగొట్టాలని చూస్తే ఎట్లా. ప్రభు త్వం పట్టుసాగుకు అనుమతి ఇవ్వాలి.
– గుంటి కిష్టయ్య, రైతు