తాండూర్ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రేంజ్ పరిధిలో దాదాపు 12 రోజుల పాటు సంచరించిన పెద్దపులి (Tiger ) ఆదివారం రాత్రి మాదారం అడవుల్లోకి (Madaram forests) ప్రవేశించింది. కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతంతో పాటు కాసిపేట వైపు సంచరించిన ఈ పులి కన్నాల అడవుల మీదుగా మాదారం బీట్ వైపు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పాదముద్రల ఆధారంగా ట్రాకింగ్ బృందం పులి ఎటు వైపు వెళ్లిందనే అంశం పై ఎప్పటికప్పుడు అధికారులకు, సమీప గ్రామాల ప్రజలకు సమాచారం అందిస్తున్నామని తెలిపారు.
పెద్దపులి ఆదివారం బుగ్గదేవాలయం సమీపంలోని కొండపోచమ్మ గుడి పక్క నుంచి అంకుశం గుట్టల మీదుగా తాండూర్ మండలంలోని మాదారం ప్రాంతంలోని గొంతెమ్మ గుట్టల ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు పులి పాద ముద్రలు గుర్తించారు. ఈ అటవీ ప్రాంతంలో నీటి కుంటలు, పత్తి చేన్లు పెద్దపులికి అనుకూల ఆవాసంగా ఉన్నాయని పేర్కొన్నారు. పులి తిర్యాని వైపు లేదా రెబ్బెన మండలం పులికుంట వైపు వెళ్లి ఉండవచ్చనే కోణంలో పులి పాదముద్రలు గుర్తిస్తూ అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
వేటగాళ్ల నుంచి పెద్దపులిని రక్షించేందుకు ఎనిమల్ ట్రాకింగ్ టీంతో క్షణక్షణం అటవీ ప్రాంతంలో పులిని పర్యవేక్షిస్తున్నారు. మాదారం అడవుల్లోకి పులి ప్రవేశించడంతో పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ రేంజ్ అధికారి తిరుపతి (Deputy Range Officer Tirupati ) , బీట్ ఆఫీసర్ భాస్కర్ స్పష్టం చేశారు.