మంచిర్యాల, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం పలువురి రేషన్ లబ్ధిదారులకు నష్టాన్ని కలిగించింది. వర్షాకాలంలో రవాణా ఇబ్బందులుంటాయన్న సాకుతూ ఎన్నడూ లేని విధంగా మూడు నెలల బియ్యం ఒకేసారి ఇచ్చేందుకు మొదలుపెట్టగా, అందరికీ అందించకుండానే ముగించేయడం ఆందోళనకు గురిచేస్తున్నది. కావాల్సినంత స్టాక్ రాక.. వచ్చినా బియ్యాన్ని స్టోర్ చేసే కెపాసిటీ లేక క్షేత్రస్థాయిలో గడిచిన నెల రోజుల్లో అనేక ఇబ్బందులు చవిచూడాల్సి వచ్చింది.
బియ్యం కోసం షాపుల చుట్టూ లబ్ధిదారులు కాళ్లు అరిగేలా తిరగాల్సి వచ్చింది. అనేక మంది కూలీలు తమ పనులన్నీ వదిలేసి మరీ రేషన్ బియ్యం కోసం షాపుల దగ్గర పడిగాపులు కాసినా ఫలితం లేకుండా పోయింది. బియ్యం లేవంటూ నో స్టాక్ బోర్డులు పెట్టడం, బియ్యం వచ్చినప్పుడు చెబుతామని డీలర్లు వెనక్కి తిరిగి పంపించిన ఘటనలు గడిచిన నెలరోజుల్లో చాలా చోట్ల కనిపించాయి. ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చనే ఉద్దేశంతో పక్కనున్న సెంటర్‌కు వెళ్లినా అదే పరిస్థితి కనిపించింది. ఇలా ఎన్నిసార్లు తిరిగినా బియ్యం దొరకక వెనుదిరిగి వెళ్లిపోయిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే తీసుకుంటే దాదాపు 30 శాతం మందికి బియ్యం అందలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
.
ఇక మూడు నెలలు లేనట్లే..
ఉమ్మడి జిల్లాలో జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల బియ్యాన్ని ఒక్కో యూనిట్‌కు నెలకు ఆరు కిలోల చొప్పున, 18 కిలోలు పంపిణీ చేశారు. జూన్ నెల ప్రారంభం నుంచి 31 తేదీ దాకా బియ్యం ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లాలో 1,41,904 కార్డు హోల్డర్స్ ఉంటే.. 1,29,646 మంది రేషన్ తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో 2,23,844 కార్డుదారులుంటే.. 2,00,179 కార్డుదారులకు బియ్యం సరఫరా చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 1,92,757 కార్డులుంటే.. 1,79,447 కార్డుదారులు బియ్యం తీసుకున్నారు. ఇక నిర్మల్ జిల్లాలో 2,19,972 కార్డులుంటే దాదాపు రెండు లక్షల పైచిలుకు మందికి బియ్యం సరఫరా చేశారు.
మొత్తంగా అన్ని జిల్లాలు కలిపి ఇంకా 30 శాతం మందికి రేషన్ అందలేదు. ఆసిఫాబాద్‌లో 12,253, మంచిర్యాలలో 23,665, ఆదిలాబాద్‌లో 13,310 కార్డుదారులకు రేషన్ చేరలేదు. జూన్ 31లోగా వీరంతా రేషన్ తీసుకోలేకపోయారు. ఇక మూడు నెలల దాకా వీరికి రేషన్ తీసుకునే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మూడు నెలల బియ్యాన్ని ముందే సరఫరా చేయమనే ఆదేశాలు ఉన్నాయి. జూన్ 31వ తేదీకి గవర్నమెంట్ ఇచ్చిన గడువును పెంచలేదని చెబుతున్నారు.
రేషన్ కావాలనుకునేవారు సెప్టెంబర్దాకా ఆగక తప్పదని పేర్కొంటున్నారు. దీంతో రేషన్ బియ్యం అవసరమైనా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. దీనిపై మంచిర్యాల జిల్లా సివిల్ స్లపయ్ అధికారులను వివరణ కోరగా.. జూన్ 31వ తేదీ లోగా సరఫరా చేయాలని ఆదేశాలు ఉన్నాయన్నారు. చాలా మంది తీసుకోలేదని, వారి కోసం ప్రభుత్వం గడువు సైతం పెంచలేదన్నారు. గవర్నమెంట్ అనుమతి ఇస్తే పంపిణీ చేసే వీలుందని, లేని పక్షంలో సెప్టెంబర్ దాకా రేషన్ బియ్యం పంపిణీ లేనట్లేనని చెబుతున్నారు.