దహెగాం, సెప్టెంబర్12 : ‘రోడ్డును బాగు చేయించండి సారూ..’ అంటూ ఆ గ్రామ యువకులు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించలేదు. చివరికి వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. సొంత ఖర్చులతో మరమ్మతులు చేపట్టి శభాష్ అనిపించుకున్నారు. దహెగాం మండల కేంద్రం నుంచి కల్వాడవైపు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయమై అధ్వానంగా మారింది. ఈ విషయమై ఇటీవల స్థానిక యువకులు ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించారు.
అయినా ఫలితం లేకపోవడంతో.. స్వయంగా రోడ్డుకు మరమ్మతులు చేయాలని నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి రూ. 1.20 లక్షలు జమ చేశారు. కంకర, సిమెంట్, ఇసుక తెప్పించారు. గురువారం దాదాపు 500 మీటర్ల వరకు రోడ్డుపైనున్న గుంతలను పూడ్చి వేసి బాగు చేశారు. ఇందుకు వారిని స్థానికులు అభినందించారు.