ఆదిలాబాద్, ఏప్రిల్ 3(నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తనాల ధరలు పెంచడంతో రైతులపై మోయలేని భారం పడనుంది. యేటా పెరుగుతున్న పెట్టుబడులు, ప్రకృతి వైపరీత్యాలు, ఎరువుల ధరలు పెరగడం, మద్దతు ధర చెల్లించకపోవడం, బ్యాంకులు, ప్రైవేటు అప్పులతో సతమతం అవుతున్న రైతులపై మరో పిడుగు పడింది. కేంద్ర వ్యవసాయ శాఖ పత్తి విత్తనాల ప్యాకెట్లు 475 గ్రాముల ధరను రూ.901గా నిర్ణయిస్తూ ప్రకటన విడుదల చేసింది.
సాగులో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న తాము పెరిగిన విత్తనాల ధరతో మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో యేటా 4 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుంది. పత్తి సాగుకు అనుకూలమైన నల్ల రేగడి నేలలతోపాటు వాతావరణ పరిస్థితులు, అధిక వర్షపాతం ఫలితంగా అధికంగా సాగవుతుంది. మన వద్ద పండే పత్తికి ఆసియాలోనే నాణ్యమైనదిగా పేరుంది. రెండు ఎకరాల సాగుకు 475 గ్రాముల మూడు పత్తి ప్యాకెట్లు అవసరమవుతాయి. జూన్ మొదటి, రెండో వారంలో పత్తి విత్తనాలు వేస్తుండగా.. అక్టోబరు చివరి వారంలో దిగుబడులు ప్రారంభమవుతాయి. ఒక్కొక్కరు కనీసం ఐదెకరాల నుంచి 50 ఎకరాల వరకు పత్తిని వేస్తారు.
మోయలేని భారం
కేంద్ర ప్రభుత్వం పెంచిన పత్తి విత్తనాల ధరల ఫలితంగా రైతులపై మోయలేని భారం పడుతుంది. ఏకంగా ఒక్కో ప్యాకెట్‌పై రూ.37 పెంచడంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గతేడాది వానకాలంలో పత్తి ప్యాకెట్ ధర రూ.864 ఉండగా.. ఈ ఏడాది రూ.901కు చేరనుంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన పత్తి విత్తనాల ధరల ఫలితంగా రైతులపై రూ.2.50 కోట్ల భారం పడనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ లేకపోవడంతో ప్రైవేటు డీలర్ల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది.
2021-22లో పత్తి విత్తన ప్యాకెట్ ధర రూ.767 ఉండగా 2022-23 లో రూ.810 కి పెంచింది. 2023-24లో రూ.853, 2024-25లో రూ. 864కు పెంచింది. దీంతో రైతులు క్రమంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ ఏడాది ఏకంగా రూ.37 పెంచడంతో కేంద్ర నిర్ణయంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట కొనుగోళ్లలో ఇబ్బందులు పెడుతున్న కేంద్ర విత్తనాల ధర విషయంలో మాత్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సబ్సిడీపై ఇవ్వాలి..
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. ఇప్పటికే పెరిగిన పెట్టుబడు లు, ఎరువుల ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నాణ్యత లేదంటూ మద్దతు ధర కంటే రూ.100 తక్కువ చెల్లించి కొనుగోలు చేసింది. తేమ అధికంగా ఉందని కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్టపోయాం. ఈ యేడాది ప్యాకెట్ ధర రూ.864 నుంచి రూ.901 పెంచడం అన్యాయం. ఒకటేసారి ప్యాకెట్‌పై రూ.37 పెంచితే భారం పడుతుంది. ఒక్కో రైతు కనీసం 10 ప్యాకెట్ల నుంచి 100 ప్యాకెట్లు కొనుగోలు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పత్తి విత్తనాలకు సబ్సిడీ ఇచ్చి రైతులు నష్టపోకుండా చూడాలి.
– వెంకట్‌రెడ్డి, రైతు,కజ్జర్ల, తలమడుగు మండలం
పత్తి విత్తనాల ధర పెంచడం అన్యాయం
పత్తి విత్తనాల ధరను పెంచ డం సరైన పద్ధతి కాదు. ఇప్పటికే సరైన దిగుబడి లేకుండా ఇబ్బందులు ఎదురొంటున్నాం. విత్తనాల ధర పెంపుతో ఆర్థిక భారాన్ని ఎదురొవాల్సి వస్తుంది. పత్తి సాగు ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎరువులు, పురుగుల మందు లు, కూలీల ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు విత్తనాల ధరలను కూడా పెంచితే, మేమెలా సాగు చేసేది? రైతులపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనకి తీసుకుని తక్షణమే ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. విత్తన ధర పెంపుతో చిన్న రైతులు కష్టాల్లో పడే ప్రమాదం ఉంది.
– అండె ఆనంద్, రైతు, పొన్నారి, తాంసి మండలం
కేంద్రం రైతుపై పగబట్ట్టినట్లుగానే ఉన్నది..
కొన్నేండ్లుగా కేంద్ర సర్కారు అన్నదాత మీద పగబట్టినట్లుగా కనిపిస్తున్నది. పత్తి విత్తన ధర పెంచడం పత్తి రైతులందరి పాలిట శాపమే. అతివృష్టి, అనావృష్టి వంటి పరిస్థితులను ఎదుర్కొంటూ గుండె ధైర్యంతో సాగు చేస్తున్నా.. అంతిమంగా మద్దతు ధర లభించడం లేదు. రైతుల ఆత్మహత్యల్లో అధికంగా పత్తి రైతులే ఉండడం విచారకరం. ఇలాంటి క్లిష్ట సమయంలో విత్తన ధరలు పెంచడం సమంజసం కాదు. కేంద్రం ఆలోచించి పత్తి రైతులకు న్యాయం చేయాలి.
– మంగదుడ్ల శ్రీనివాస్ యాదవ్, రైతు, వడూర్, భీంపూర్ మండలం
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..
అసలే పత్తి రైతు పరిస్థితి బాగా లేదు. ఈ వానకాలం అతివృష్టి, వరదలతో వాగులు, పెన్‌గంగ పొంగి తీవ్రంగా నష్టపోయాం. తరువాత పత్తికి ధరలు లేవు. ఇపుడేమో యాసంగి పంటలకు నీళ్లు లేవు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం పత్తి విత్తన బ్యాగుల ధర పెంచడం మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందమే అవుతుంది. కేంద్ర సర్కారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
– తూడి వినోద్, రైతు, గుబిడి, భీంపూర్ మండలం