దిలావర్పూర్, అక్టోబర్ 12 : కేసీఆర్ సర్కారు రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కూడా 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ పేరిట పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు యేడాదికి రూ.6 వేలను మూడు విడుతల్లో (విడుతకు రూ.2 వేల చొప్పున) రైతుల ఖతాల్లో జమ చేసింది. గతంలోనే వ్యవసాయ శాఖ ద్వారా రైతుల వివరాలను జనవరి 31,2019 కటాఫ్‌గా విధించి వివరాలు తీసుకున్నది. జనవరి 31, 2019 తరువాత భూములు కొనుగోలు చేసిన, వారసత్వంగా వచ్చిన, బదలాయింపు ద్వారా వచ్చిన కర్షకులకు పీఎం కిసాన్ పథకం వర్తించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 4,96,005 హెక్టార్ల సాగు భూములు ఉన్నాయి. ఇందులో పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయం తీసుకుంటున్న రైతు కుటుంబాల సంఖ్య 53,469గా ఉంది.
నిబంధనల పేరిట కొర్రీలు
ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం అనేక కొర్రీలు విధించింది. మన వద్ద ఉన్న పక్కా సమచారం ఇవ్వకున్న పెట్టుబడి సాయం నిలిపి వేస్తున్నారు. నెలకు రూ.10 వేల పింఛన్ తీసుకుంటున్న వారు, ప్రభుత్వ ఉద్యోగు లు, కుటుంబంలో దంపతులకు వేరు వేరు గ్రామాల్లో భూములున్న కుటుంబంలో ఒకరికి వర్తిస్తుంది. ప్రజాప్రతినిధులు, ఆదాయపన్ను చెల్లింపుదారులు, విదేశాల్లో నివాసం ఉంటున్న వారికి ఈ పథకం ద్వారా సాయం అందడం లేదు. కాగా.. పీఎం కిసాన్సహా కేంద్ర పథకాలు వర్తింప జేసేందుకు రైతులకు విశిష్ట గుర్తింపు కార్డు ఇచ్చే విధానాన్ని చేపట్టారు. ఈ కార్డు కోసం 11 నంబర్లతో కూడిన సంఖ్య కేటాయించింది. దీని కోసం రైతులు రైతువేదికల చుట్టూ, గ్రామ పంచాయతీల చుట్టూ తిరిగి ఏఈవోల వద్ద వివరాలు నమోదు చేసుకోన్నారు. ఈ విశిష్ట సంఖ్య పొందితే సాయం అందుతుందని ఆశపడ్డారు. కానీ.. రైతులకు నిరాశే మిగిలింది.
పైసలు రావడం లేదు..
40 ఏండ్లుగా నాకున్న మూడెకరాల భూమిని సాగు చేసుకుంటున్న. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ద్వారా డబ్బులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సహాయం రావడం లేదు. అనేక సార్లు కార్యాలయానికి వెళ్లా. అధికారులు కాగితాలు తీసుకుంటున్నరు. తప్ప పైసల్ మాత్రం రావడం లేదు. మాది వ్యవసాయ కుటుంబమే. కానీ.. ప్రభుత్వం మాకు పెట్టుబడి సాయం అందడం లేదు. – సాయన్న, రైతు, దిలావర్పూర్.