“నేను చెప్పిందే వేదం.
నన్ను కాదని ఎవరూ ఏం చేయలేరు. ముందు నుంచి అధికార పార్టీని పట్టుకుని ఉంది నేను. అందుకే చెప్తున్నా.. ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి నాకు పైసలు రావాల్సిందే.” అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారులకు హుకూం జారీ చేసినట్లు సమాచారం. డిపార్ట్మెంట్ను బట్టి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు.. ఇలా డిపార్ట్మెంట్లవారీగా ఆయా శాఖల హెచ్వోడీలను పిలిపించుకుని ప్రత్యేక టార్గెట్లు ఇచ్చినట్లు తెలిసింది.
మా జిల్లాలో పని చేయాలనుకుంటే నేను అడిగినన్నీ డబ్బులు ఇవ్వాల్సిందే. లేకపోతే మీరు పని చేయలేరంటూ అల్టిమేటం జారీ చేశారట. దీంతో ఆ జిల్లాలో పని చేసే ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేమని మమ్ములను ట్రాన్స్ఫర్ చేసినా పర్లేదు. ఇలా టార్గెట్లు పెట్టి డబ్బులు డిమాండ్ చేయడం ఏందంటూ ఆందోళన చెందుతున్నారు. సదరు ఎమ్మెల్యేను ఎలా డీల్ చేయాలో తెలియక.. కొందరు ఉన్నతాధికారులు లాంగ్ లివ్పెట్టి వెళ్లిపోయేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యేను గతంలో ఎక్కడా చూడలేదంటూ వాపోతున్నారు.
– మంచిర్యాల, మార్చి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
అయ్యా.. ఎస్ అంటేనే ఓకే..
జిల్లాలో ఆ ఎమ్మెల్యే ఏం చెప్తే అదే జరగాలి. ప్రభుత్వ నిబంధనలు ఆయనకు అసలే వర్తించవు. జిల్లా ఉన్నతాధికారులు ఆయన ఏం చెప్తే దానికి అయ్యా.. ఎస్ అనాల్సిందే. రూల్స్‌కు వ్యతిరేకంగా చేసినా చూసీచూడనట్లు ఊరుకోవాలి. లేకపోతే సార్‌కు కోపం వస్తది. అనుమతులు లేకుండానే ఏ పనైనా చేసేస్తారు. ఇష్టం లేనిది కూల్చేస్తారు. ఇష్టం వచ్చింది కట్టేస్తారు. సార్ అనుచరులైతే గవర్నమెంట్ భూములను కబ్జా చేసిన ఓకే. సార్‌కు పడనోళ్లు పర్మిషన్ లేకుండా ఒక్క ఫ్లోర్ కట్టినా అది నేలమట్టం కావాల్సిందే.
సార్ చెప్పినదానికి అధికారులు ఒకే చెప్పడం తప్ప ఇప్పటివరకు జిల్లాలో నియమనిబంధనల మేరకు జరిగిన ఒక్క పని కూడా లేదు. సార్ ఏం చెప్తే అది చేస్తున్నప్పటికీ శాఖలవారీగా ఈ డబ్బులు ఇవ్వడం ఏంటన్నది ఇప్పుడు జిల్లా అధికారులకు అర్థం కావడం లేదు. ఏ పనైనా చేస్తాం తప్ప పైసలకు ఏక్కడికి పోయేది. కింద పని చేసే అధికారులను డబ్బులు అడిగితే మా పరువు ఏం కావాలి. జిల్లా హెచ్‌వోడీ సీట్లో కూర్చొవడమే మేము చేసిన తప్పా. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏం ఉంటుందంటూ ఆయా శాఖల ఉన్నతాధికారులు బాధపడుతున్నారు. ఎమ్మెల్యే పెట్టిన పైసల టార్గెట్ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమైపోతున్నారు.
కుల సంఘాలు, వ్యాపార వర్గాల నుంచి డిమాండ్
ప్రభుత్వ శాఖల అధికారులతోపాటు కుల సంఘాలు, వ్యాపార వర్గాలను ఆ ఎమ్మెల్యే సార్ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒకటో, రెండో చెప్పుకోదగ్గ పనులు ఏమైనా చేసిందంటే అది సారు నియోజకవర్గంలోనే. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రత్యేకమైన పనులు, నిధులు ఏం లేవు. ఇటీవల ఎన్నికల కోడ్ ఉండగానే అట్టహాసంగా అన్ అఫీషియల్ ప్రారంభోత్సవం చేసిన ఓ ప్రాజెక్ట్ విషయంలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తున్నది.
గతంలో ఎవ్వరూ చేయలేనిది తాను చేశానంటూ ప్రచారం చేసుకుంటున్న సదరు నేత.. ఆ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కోసం కుల సంఘాలు, వ్యాపార సంఘాలను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన పని ప్రతి నెల రూ.5 లక్షలు అవసరం అవుతాయి. అందుకని మీ కుల సంఘం తరఫున రూ.లక్ష ఇవ్వండి అంటూ వ్యాపారాలు చేసే ప్రధానమైన రెండు కుల సంఘాల నాయకులకు హుకూం జారీ చేశారట. ప్రభుత్వం నుంచి రూ.లక్షన్నర వస్తది.
మిగిలింది చూద్దాం అంటూ చెప్పారట. ఇది ఇప్పుడు సార్ నియోజకవర్గంతో పాటు జిల్లా కేంద్రంలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇక జిల్లాలో మొత్తం ఎన్ని వైన్స్ షాపులు ఉన్నాయో అన్ని షాపులు నెలకు రూ.25 వేల చొప్పున ఇవ్వాలని అడిగారట. దానికి షాపుల నిర్వాహకులు సంవత్సరానికి ఒకసారంటే ఇస్తామేమో గానీ, నెలనెల ఇవ్వలేం అంటూ సార్‌ను బతిమిలాడుకున్నారని తెలిసింది.
గెలిచిన ఏడాదిన్నరలో వచ్చిన మంచి పేరు ఏమో గానీ, అధికారులను, కుల సంఘాలను డబ్బులు డిమాండ్ చేయడంతో సార్‌తోపాటు అధికార పార్టీ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతున్నది. ఇన్ని రోజులు అధికారికంగా ఏం చేసినా మిన్నకుండిపోయిన జనాలు.. ఇప్పుడు సార్ దృష్టి తమపై పడడంతో బయటికి వచ్చి ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేసిన విషయంపై తెగ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా సార్ ఆలోచన మారుతుందా? లేకపోతే డబ్బులు ఇవ్వాలనే ఒత్తిడి పెరుగుతుందా? అన్నది తేలాల్సి ఉన్నది.