దండేపల్లి, అక్టోబర్19: తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక ఆదివాసీ గిరిజన దైవ మందిరంగా ప్రసిద్ధిగాంచిన పద్మల్పురి కాకో అమ్మవారి ఆలయం దండారీ సంబురాలకు ముస్తాబైంది.మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరం వద్ద ఉన్న ఈ ఆలయానికి ప్రతి యేటా దసరా పండుగ అనంతరం వచ్చే ఆశ్వీయుజ పౌర్ణమి నుంచి ఆరంభమయ్యే దండారీ ఉత్సవాలు దీపావళి అమవాస్య వరకు అంగరంగవైభవంగా కొనసాగుతాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర, కిన్వట్, ఒరిస్సా, చత్తీస్ఘఢ్ రాష్ర్టాల నుంచి వేలాదిగా భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఇందులో భాగంగా రేలా..రేలా.. అంటూ గుస్సాడి నృత్యాలు చేస్తారు. మహిళలు కూడా సంప్రదాయబద్ధంగా నృత్యాలతో సందడి చేయడం కనిపిస్తుంది.
ఆదివాసీల ఆరాధ్య దైవం కాకో అమ్మవారు..
పద్మల్పురి కాకో అమ్మవారిని ఆదివాసీలు ఆరాధ్యదైవంగా భావిస్తారు. పూజలు చేస్తే అష్ట ఐశ్యర్యాలు, సుఖశాంతులు కలిగి, పాడిపంటలు బాగా పండుతాయని గిరిజనులు విశ్వసిస్తారు. పాయసంతో పాటు రుబ్బిన పెసరు, మినుములు, బబ్బెర గారెలు, దంచిన బియ్యంతో తయారుచేసిన అరిసెలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం మేకలు, కోళ్లు బలిచ్చి ఆలయం సమీపంలో వంటలు చేసుకొని సామూహిక భోజనాలు చేస్తారు. కొత్తగా పెండ్లయినా జంటలు అమ్మవారి ముందు భేటీ(కొత్త కోడ్ల పరిచయం) కార్యక్రమం నిర్వహిస్తారు.
గోదావరి తీరం..పుణ్య స్నానాల మయం…
వివిధ ప్రాంతాల నుంచి దండారీ ఉత్సవాలకు ఆలయానికి చేరుకునే భక్తులు ముందుగా గోదావరి నదికి డప్పుచప్పుళ్లతో కాలినడకన చేరుకుంటారు. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, గోదావరి వద్ద భక్తులు పూజలు చేశారు. అనంతరం నదీజలాలతో అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. పద్మల్పురి కాకో ఆలయానికి గత తెలంగాణ ప్రభుత్వం రూ.36 లక్షలు మంజూరు చేసి, ఆలయం అభివృద్దికి కృషి చేసింది.
ప్రత్యేక ఆకర్షణగా గుస్సాడీ నృత్యాలు.
ఆలయ ఆవరణలో నిర్వహించే గుస్సాడీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. నెత్తిన నెమలి పించంతో తయారు చేసిన టోపి, కళ్లద్దాలు, భుజాన జింక తోలు, నడుముకు, కాళ్లకు గజ్జెలు ధరించి, చేతిలో కోలా పట్టుకొని తప్పెట గూళ్ల వాయిద్యాలకు, డప్పు చప్పుళ్లతో వారు చేసే నృత్యాలు ఎంతో ఆకట్టుకోనున్నాయి. గుస్సాడి నృత్యాలకు ముందు మహిళలు బొట్టు పెట్టి గుస్సాడీల ఆశీర్వాదం తీసుకోవడం వారి ఆచారం.