ఇచ్చోడ, సెప్టెంబర్ 3 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చోడ మండలం జామిడి గ్రామ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. జామిడి గ్రామంలో 1131 మంది జనాభా ఉండగా, ఏడు వార్డులు ఉన్నాయి. గత ప్రభుత్వాల హయాంలో డ్రైనేజీలు లేకపోవడం, గుంతల రోడ్లు, తాగునీరు, విద్యుత్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామంలో పల్లెప్రకృతివనం, డంప్‌యార్డు, వైకుంఠధామం, డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం, హరితహారంలో నాటిన మొక్కలతో ఎక్కడ చూసినా పరిశుభ్రం, పచ్చదనంతో కళకళలాడుతున్నది.
ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్రాక్టర్‌తో సిబ్బంది నిత్యం చెత్త సేకరించి డంప్‌యార్డుకు తరలించడంతో విధులు పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. గ్రామంలోని కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మించడంతో అందంగా కనిపిస్తున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు పడుతున్నారు. దీంతో గ్రామాన్ని వెళ్లే రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. సర్పంచ్ సుభాష్ పటేల్, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి జ్ఞానేశ్వర్, ఉపసర్పంచ్ అనిత, వార్డు సభ్యుల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు.
గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యం..
గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. పల్లెప్రగతితో జామిడి గ్రామ కొత్త శోభ సంతరించుకుంది. ప్రజలు, వార్డుసభ్యుల సహకారంతో ప్రణాళిక ప్రకారం నిధులు ఖర్చు చేస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ వంటివి ఉపయోగపడుతున్నాయి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో రసాయనాలు పిచికారీ చేయిస్తున్నాం.
హెచ్ సుభాష్ పటేల్, సర్పంచ్, జామిడి
ట్రాక్టర్లోనే చెత్త వేస్తాం
గ్రామ పంచాయతీ నుంచి తడి, పొడి చెత్తబుట్టలు ఇచ్చారు. ఇంటిలో చెత్తను జీపీ ట్రాక్టర్ వచ్చిన తర్వాత అందులో వేస్తాం. పల్లెప్రగతి కార్యక్రమం మొదలైనప్పటి నుంచి చాలా మార్పు వచ్చింది. మొక్కలు పెంచడంతో పాటు దోమలు రాకుండా ఎప్పటికప్పడు మందులు పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికే పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పనులు పూర్తయ్యాయి.
-ఎన్ మహదావ్, గ్రామస్తుడు,జామిడి