DSC-2024 | ఎదులాపురం, ఫిబ్రవరి11: డీఎస్సీ-2024 అభ్యర్థులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంబ్లె ప్రజ్ఞశీల్ తేల్చి చెప్పారు. తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం, ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2024 డీఎస్సీ రిక్రూట్మెంట్లలో అక్రమ నియామకాలకు బాధ్యత జిల్లా విద్యశాఖదేన్నారు. 2024 ఉపాధ్యాయ నియామకాల్లో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రీవెరిఫికేషన్ జరగాలని కాంబ్లె ప్రజ్ఞశీల్ అన్నారు. నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్ ఇచ్చిన ఉట్నూర్ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ షబీర్ పై క్రిమినల్, చీటింగ్ కేసులు నమోదు చేసి పాఠశాల గుర్తింపు రద్దు చేయాలన్నారు. ఎన్సీఆర్టీ గుర్తింపు లేని కాలేజీల ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన పీఈటీ, పీడీలను తొలగించాలన్నారు. ఫేక్ సర్టిఫికెట్ తో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను తొలగించి తర్వాత ర్యాంక్ వచ్చిన అభ్యర్థులతో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో దళిత ఆదివాసీ విద్యార్ధి సంఘాలు, నిరుద్యోగులు, 2024-డీఎస్సీ అభ్యర్థులతో కలిసి రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆదివాసీ విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిడాం జంగుదేవ్ పటేల్, టీఎస్ఎస్వే జిల్లా అధ్యక్షులు జాడి వెంకటేష్ నేత, ఆదివాసీ విద్యార్ధి సంఘం ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంగం దీపక్ కుమార్, నాయకులు ఆత్రం ఉపేంద్ర, కోటేష్, తుకారాం, మోతీరాం పాల్గొన్నారు.