మంచిర్యాల టౌన్ : సింగరేణి కార్మికులు, ప్రజల సంక్షేమం, కోసమే జీవితాంతం పరితపించిన ప్రత్యేక రాష్ట్ర పోరాట యోధుడు మునీర్ ( Munir ) అని జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్ ( Additional Collector Motilal ) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలో సింగరేణి రిటైర్డ్ కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన మునీర్ సంస్కరణ సభ, అన్నదాన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
నాయకులు, కార్మికులు మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి లర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గని కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం అధికారులతో తలపడి నిలబడిన గొప్ప ధైర్యశాలి మునీర్ అని ప్రసంశించారు. సింగరేణి సకల జనుల సమ్మె విజయవంతం కావడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. సింగరేణి కార్మికులు, నాయకులు మునీర్‌ను ఆదర్శంగా తీసుకొని సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
నిజాయితీతో జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి కార్మికుల, పేదల పక్షాన నిలబడ్డరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీటీవో సంతోష్ కుమార్, సింగరేణి రిటైర్డ్ కార్మికులు గూడూరు యాదిరెడ్డి, వెంకట్రాజం, బార్ అసోసియేషన్ నాయకులు సందాని, కర్ర లచ్చన్న, మొహియుద్దీన్, దమ్మల శ్రీనివాస్, జలాలుదీన్, తాజ్, రాయమల్లు, రాజేందర్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.