సోన్, జులై 26 : వర్షాకాలం ప్రారంభమై నెలన్నర పూర్తవుతున్నది. వరి నారుమడులు వేసి 35 రోజులవుతున్నది. వరి 30 రోజుల నారును నాటు వేసుకుంటే పంట ఎదుగుదలతో పాటు మంచి దిగుబడులు వస్తాయి. ఇప్పటివరకూ ఒ క్క భారీ వర్షం కురవకపోవడంతో చెరువులు, నదులు, ప్రాజెక్టులు నిండక వాగుల్లో నీరు రాకపోవడంతో వీటి కింద సాగు చేసే వరి రైతులు ఆ కాశం వైపు చూస్తున్నారు. రెండ్రోజులుగా నల్లటి మబ్బులు వస్తున్నాయే తప్పా వర్షం కురవడం లేదు.
వర్షాలపై ఆశలు వదులుకోవాల్సిందేనా ? లేక ఇంకా కొన్ని రోజులు ఎదురుచూడాలా ? అనే సందిగ్ధంలో రైతులు పడ్డారు. ఇప్పటివరకూ వరి నారుకు ఉన్న కొద్దిపాటి నీటితో బతికించుకున్నామని, ప్రస్తుతం అవి నాటుకు రావడంతో ఎలా అని మదనపడుతున్నారు. తమ కుటుం బం అవసరాల కోసం తిండి కోసమైనా సాగు చేసుకుందామా ? నాటు వేస్తే రాబోయే రోజుల్లో నీరు లేక ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు రావేమోనని వెనుకడుగు వేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని చెబుతుండడంతో నిర్మల్, సోన్ మండలంలోని ఆయా గ్రామాల్లో వరి సాగు చేసే రైతులు ప్రస్తుతం వర్షాలు కురవాలని గ్రామాల్లో కప్పతల్లి ఆట ఆడుతూ గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
కుభీర్, జూలై 26 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోనే పెద్దదైన కస్రా రిజర్వాయర్ చుక్క నీరు లేక వెలవెలబోతున్నది. వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెలన్నర దాటినా ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాలు కురవడం లేదు. కురిసినా నీరంతా పడ్డది పడ్డట్లే ఇంకిపోతుండడంతో వాగులు, వంకలు, ఒర్రెలు, చెరువుల్లో చుక్కనీరు లేక పోవడంతో మూగజీవాలకు సైతుం తాగేందుకు నీరు కరువైంది. వరుణుడు కరుణిస్తే తప్ప సాగుకు, పాడి పరిశ్రమ కష్టాలు గట్టేక్కే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ముథోల్, జూలై, 26 : పత్తిలో కలుపు తీస్తుండగా పిడుగుపాటుకు గురై మహిళ మృతి చెందగా, మరో మహిళకు తీవ్రగాయాలైన ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని గన్నోరా గ్రామంలో ఆదివారం జరిగింది. బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నోరా గ్రామానికి చెందిన రుక్మా, అప్పాల నర్మద ఇద్దరు మహిళలు పత్తి చేనులో కలుపు తీసేందుకు వెళ్లారు.
సాయంత్రం 4 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వారిద్దరూ సమీపంలోని చెట్టు కిందకు వెళ్లగా ఒక్కసారిగా పిడుగు పడడంతో అప్పాల నర్మద (45) తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. రుక్మా తీవ్రగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. గమనించిన స్థానిక రైతులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందజేశారు. వెంటనే అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకొని గాయాలపాలైన రుక్మను 108 సిబ్బంది భీంరావు, శేఖర్ ప్రథమ చికిత్సను అందజేసి భైంసా ఏరియా దవాఖానకు తరలించారు.