బోథ్, ఆగస్టు 18: మండలంలోని నిగిని అటవీ ప్రాంతంలో కైలాస్ శిఖర గుట్టలోని మహాదేవుని ఆలయం గోశాల వద్ద తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన తీజ్ ఉత్సవాలు గురువారం ముగిశాయి. తీజ్ (గోధుమ) మొలకలను మహిళలు నెత్తిన పెట్టుకొని సంప్రదాయ బంజారా నృత్యాలు చేశారు.
అంతకుముందు శ్రీసంత్ లింబాజీ మహారాజ్ తీజ్‌లను తెంపి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. గోశాల నుంచి ఊరేగింపుగా వెళ్లి సమీప నీటి కుంటలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా మహారాజ్ మాట్లాడుతూ సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, పండుగల ద్వారానే ఒక్క చోట చేరే అవకాశం దక్కుతుందన్నారు. నేరడిగొండ జడ్పీటీసీ జాదవ్ అనిల్, బోథ్ సొసైటీ చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బీ శ్రీధర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యుడు నరేందర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.