మంచిర్యాల, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొందరు ఉన్నతాధికారుల తీరుతో అభాసుపాలవుతున్నది. ఆ శాఖలో రోజుకో వ్యవహారం తెరపైకి వస్తుండగా, ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నది. ఇటీవల వార్డెన్ల బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆగస్టు 28న ‘నమస్తే తెలంగాణ’ ‘గిరి సంక్షేమ శాఖలో బదిలీలలు’ శీర్షికన కథనం ప్రచురితమవ్వగా, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా స్పందించి అర్హులకు పోస్టింగ్‌లు వచ్చేలా న్యాయం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో.. ఈ నెల 9న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సీఆర్టీ) బదిలీల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఉపాధ్యాయులు రోడ్డుకెక్కారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలో అర్ధరాత్రి ధర్నా చేసి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
మంగళవారం మధ్యాహ్నం ఆదివాసీ నాయకులతో కలిసి మరోసారి ధర్నా చేశారు. మంచిర్యాల గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే ఏసీఎంవో కొందరి వద్ద డబ్బులు తీసుకొని.. వారికి కావాల్సిన దగ్గర పోస్టింగ్‌లు ఇచ్చారంటూ ఆరోపించారు. ఏసీఎంవోకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. నిర్మల్‌కు బదిలీపై వెళ్లిపోయిన ఆయన అక్రమ డిప్యూటేషన్‌తో తిరిగి వచ్చి మంచిర్యాలలోనే పని చేస్తున్నారని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో చాలా మంది ఉపాధ్యాయులు డిప్యూటేషన్లు లేకుండా ఇష్టం వచ్చిన చోట పనిచేస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులకు డబ్బులు ఇస్తే చాలు డిప్యూటేషన్ ఆర్డర్ లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ పని చేసేందుకు అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు.
సాధారణంగా ఏసీఎంవో (అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్) పో స్టు, స్థానిక ఉపాధ్యాయులకు మాత్రమే ఇవ్వాలి. కానీ మంచిర్యా ల జిల్లాలో మాత్రం నిర్మల్‌కు బదిలీ అయిన వ్యక్తికి డిప్యూటేషన్ ఇచ్చి మరీ ఇక్కడే కొనసాగిస్తున్నారు. ఈ ఏసీఎంవోతో పాటు రా ష్ట్రవ్యాప్తంగా 90 మంది ఏసీఎంవోలను ట్రాన్స్ఫర్ చేశారు. ‘వారందరినీ కాదని ఈయన ఒక్కరికే డిప్యూటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటి. అలాగైతే 90 మందిని ట్రాన్స్ఫర్ చేయకుండా ఎ క్కడి వారిని అక్కడ కొనసాగించవచ్చు కదా. బదిలీ చేయడం దేని కి.. అన్ని అర్హతలు ఉండి ఏసీఎంవో పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారిని పక్కన పెట్టి బదిలీపై వెళ్లిపోయిన వ్యక్తిని ఏసీఎంవోగా ఎందుకు కొనసాగిస్తున్నారు.’ అని అర్హులైన ఉపాధ్యాయులు ప్ర శ్నిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏసీవోల పోస్టింగ్‌కి ఒక ప్రాసె స్ ఉంది. నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలి.
ఆశ్రమ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్న వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మంచిర్యాల ఏసీఎంవో బదిలీ అయ్యాక అర్హులైన వారు దరఖాస్తు సైతం చేసుకున్నారు. కానీ ఈ విషయాన్ని తొక్కిపెట్టి ఇక్కడ ఎవ్వరూ పని చేయడానికి సిద్ధంగా లేరు. నాకే పో స్టింగ్ ఇవ్వండి అని ఇప్పుడున్న ఏసీఎంవో ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తాకు చెప్పుకున్నారట. అందుకే పీవో డిప్యూటేషన్ ఇచ్చారని తెలిసింది. కానీ ఇక్కడ పని చేయడానికి అప్లికేషన్లు పెట్టుకున్న టీ చర్లు ఉన్నారన్న విషయం మేడమ్ దృష్టికి వెళ్లలేదని సమాచారం.
గతంలో వార్డెన్ల పోస్టింగ్ విషయంలో డబుల్ గేమ్ ఆడి పీవోను తప్పుతోవ పట్టించిన జిల్లా అధికారులు ఈ విషయంలోనూ మేడమ్ బోల్తా కొట్టించారని అర్హులైన ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పీవో డిప్యూటేషన్ ఆర్డర్ ఇస్తే దాన్ని బయట పెట్టాలంటున్నారు. ఒకవేళ పీవో ఆర్డర్ ఇచ్చి ఉంటే జిల్లాకు చెందిన వారితోనే ఈ పోస్టు భర్తీ చేయాలి అనే విషయం మేడమ్ దృష్టికి మంచిర్యాల జిల్లా గిరిజన సంక్షేమ అధికారి (డీటీడీవో) తీసుకెళ్లారా.. లేదా.. అనే విషయంలో అనుమానాలు ఉన్నాయంటున్నారు.
ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో గిరిజనులకే ఏసీఎంవో పోస్టులు ఇచ్చారు. మంచిర్యాలలో మాత్రం గిరిజనేతరుడికి పోస్టు ఇచ్చారు. దాన్ని మార్చాలంటూ ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అర్హులైన గిరిజనులను కాదని గిరిజన వ్యతిరేకిని ఆ పోస్టులో ఉంచారని ఆరోపిస్తున్నారు. పీవో ఇచ్చింది పూర్తిగా ఇల్లీగల్ ఆర్డర్ అని.. ప్రాసెస్‌ను అనుసరించి స్కూల్ అసిస్టెంట్ సీనియర్లకు ఆ పోస్టు ఇవ్వాలని, నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష నిర్వహించి భర్తీ చేయాలని కోరుతున్నారు. జి ల్లాకు సంబంధించిన వారితో భర్తీ చేయాల్సిన పోస్టును డీటీడీవో డబ్బులకు అమ్ముకున్నారని, అందుకే నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డిప్యూటేషన్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
అలాంటిదేదీ లేకపోతే వెంటనే అర్హులకు న్యాయం చే యాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల డీటీడీవో గిరిజన వ్యతిరేకి అన్నారు. జన్నారంలో స్కూల్ సామగ్రి అక్రమంగా తీసుకెళ్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుపట్టారని, మల్కపల్లిలో ఓ పిల్లాడు కాలిపోయిన ఘటనలో ఆయన్ని సస్పెండ్ చేశారని, గతంలో సద రు అధికారిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయంటున్నారు. అలాంటి వ్యక్తిని ట్రాన్స్ఫర్ అయ్యాక కూడా ఎలా కొనసాగిస్తారని మండిపడుతున్నారు. అధికారుల తీరుతో గిరిజన విద్యార్థులు ఆగమైపోతున్నారంటున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అడ్మిషన్లు తగ్గడానికి కూడా అధికారుల తీరే కారణమని ఆరోపిస్తున్నారు.
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఎలాంటి ఆర్డర్లు లేకుండా పని చేస్తున్న ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నట్లు తెలిసింది. ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లకుండా డిప్యూటేషన్ ఆర్డర్లు లేకుండా పాత పాఠశాలల్లోనే ఇప్పటికే పని చేస్తున్నారు. కాకపోతే జీతం మాత్రం ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారో అక్కడి నుంచి తీసుకుంటున్నారు.
మంచిర్యాల జిల్లాలో పని చేస్తున్న కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సీఆర్టీ)ల బదిలీల కోసం కౌన్సెలింగ్ నిర్వహించారు. 64 మంది స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి సోమవారం పోస్టింగ్‌లు ఇచ్చారు. వీరిలో సీనియార్టీ ప్రకారం ఇవ్వకుండా ఏవో కారణాలు చెప్పి డబ్బులు ఇచ్చిన వారికి వారు కోరుకున్న చోట పోస్టింగ్‌లు ఇచ్చారని ఉపాధ్యాయులు అంటున్నారు. ఉదాహరణకు.. సీనియార్టీ లిస్టులో 20వ ప్లేస్‌లో ఉన్న ఉపాధ్యాయుడికి ఏదో కారణం చెప్పి ఫస్ట్ ప్రియార్టీగా కోరుకున్న చోట పోస్టింగ్ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏసీఎంవో కీలక పాత్ర పోషిస్తున్నారని, దీంతో సీనియర్లంతా నష్టపోవాల్సి వస్తున్నదంటూ ఉపాధ్యాయులు అంటున్నారు. ఆయన్ని ఇక్కడి నుంచి పంపించే వరకూ పోరాటం ఆగదని, అక్రమ డిప్యూటేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 9వ తేదీన కౌన్సెలింగ్‌లో అన్యాయం జరిగిన వారందరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో డీటీడీవో గంగారంను వివరణ కోరేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించింది. కలెక్టర్‌కు వెళ్లి డీటీడీవో అపాయింట్మెంట్ కోరగా.. అక్కడ అటెండర్ సార్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నారన్నారు. సార్ కోసం వెయిట్ చేస్తుండగా వీసీ అయిపోయి హడావుడిగా బయటికి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి కాల్ చేయగా, ఆయన ఆన్సర్ చేయలేదు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీఎంవోను వివరణ కోరగా, నిబంధన ప్రకారమే ప్రస్తుత ట్రాన్స్ఫర్లు చేశామన్నారు. ఇందులో తనపాత్ర ఏమీ లేదన్నారు. డీటీడీవోనే దగ్గర ఉండి చూసుకున్నారని చెప్పారు. తనది అక్రమ డిప్యూటేషన్ కాదన్నారు.
పీవో ఆర్డర్ ఇచ్చారని అబద్ధం చెప్పాల్సిన అవసరం తనకి లేదన్నారు. 18 నెలల్లో ఉద్యోగ విరమణ పొందుతున్నానని, ఆ బేసిస్‌లో కోరుకున్న చోట డిప్యూటేషన్ ఇచ్చారన్నారు. మరి ట్రాన్స్ఫర్ అయ్యేముందు& ఆప్షన్ పెట్టుకునే ముందు ఇవేవీ పరిగణలోకి తీసుకోలేదా అంటే అది ఆప్షన్లో ఇవ్వలేదని ఆయన చెప్పారు. నిర్మల్ జిల్లాలో గర్ల్స్ ఆశ్రమపాఠశాలకు పురుషులను ట్రాన్స్ఫర్ చేయరని తెలిసి ఆప్షన్ పెట్టుకుంటే అక్కడ ఇచ్చారని, దానికి నేను సిద్ధంగా లేనని చెప్తే పీవో మేడమ్ ఇక్కడే ఏసీఎంవోగా పని చేసేందుకు డిప్యూటేషన్ ఇచ్చారని చెప్పారు. ఉపాధ్యాయులు, ఆదివాసీ సంఘాల నాయకుల ఆందోళనల నేపథ్యంలో దీనిపై గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల, ఐటీడీఏ పీవో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.