బెల్లంపల్లి, అక్టోబర్ 16 : బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అనేక హక్కులు సాధించారని, ప్రస్తుత గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు చేసిందేమీ లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మందమర్రి ఏరియాలోని శాంతిఖని గని ఆవరణలో కేంద్ర సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన గేట్ మీటింగ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పదేళ్లలో కేసీఆర్ అనేక కార్మిక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు.
ప్రస్తుతం గెలుపొందిన సంఘాలు కార్మిక సంక్షేమంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం పంపిణీ చేసిన లాభాల వాటాలో కార్మికులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ప్రతి కార్మికుడికి సగటున రూ. మూడు లక్షలకు పైగా రావాల్సి ఉండగా, కేవలం రూ. 1.90 లక్షలు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. గతంలో లాభాల వాటా ఏడాదికేడాది పెంచిన ఘనత కేసీఆర్‌కే దుక్కుంతుందన్నారు. సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులతో భర్తీ చేసి ప్రైవేటీకరణ దిశగా యాజమాన్యం అడుగులు వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లాభాల వాటాలో కార్మికులకు అన్యాయం చేసి సంస్థ అభివృద్ధి పేరిట ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకుంటుందని ఆరోపించారు.
యూనియన్‌లో 20 మంది చేరిక
టీబీజీకేఎస్‌తోనే కార్మికుల హక్కులు సాధ్యమని గ్రహించి పెద్ద ఎత్తున టీబీజీకేఎస్‌లో కార్మికులు చేరుతున్నారని ఆ సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. శాంతిఖని గనికి చెందిన ఇతర యూనియన్ల నుంచి 20 మంది కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరగా, ఆయన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కాగా, ఇటీవల టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా కార్యదర్శి ఆవుల రవికిరణ్ సోదరుడు మంజిత్ కిరణ్ మృతి చెందగా, మిర్యాల రాజిరెడ్డి నాయకులతో కలిసి పరామర్శించారు. మంజిత్ కిరణ్ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు బడికల సంపత్, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్, మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకటరమణ, డిప్యూటీ సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్, కోశాధికారి చెలుపూరి సతీశ్, నాయకులు రాజనాల రమేశ్, అనుముల సత్యనారాయణ, రాజశేఖర్, బెల్లం అశోక్, శాంతిఖని పిట్ కార్యదర్శి హనుమంతరావు పాల్గొన్నారు.