కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ వాంకిడి, మార్చి 15 : బీఆర్ఎస్ సర్కారు ఆ ఊరిలో ఇంటింటికీ తాగు నీరందించగా, ప్రస్తుత ప్రభుత్వ పుణ్యమాని గిరిజనం పడరాని పాట్లు పడుతున్నది. మిషన్ భగీరథ పైపులైన్‌కు మరమ్మతులు చేసే నాథుడు లేకపోవడంతో గుక్కెడు నీటి కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొన్నది.
ఎనోలిలో తాగు నీటి తిప్పలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఎనోలి గ్రామంలో సుమారు 25 కుటుంబాలుండగా, 200 వరకు జనాభా ఉంది. కేసీఆర్ సర్కారు మిషన్ భగీరథ పథకం ద్వారా ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకు నిర్మించి ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి తాగు నీరు సరఫరా చేసింది. ఏడాది క్రితం పైపులైన్ పాడవడంతో తాగు నీటికీ తీవ్ర ఇబ్బందులు మొదలయ్యాయి. గ్రామస్తులు గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. గ్రామంలో రెండు చేతి పంపులున్నప్పటికీ భూగర్భ జలాలు అడుగంటి నీరు సరిగా రావడం లేదు. చేతి పుంపుల వద్ద గంటల తరబడి పనులన్నీ వదులుకొని అవసరాలు తీర్చుకుంటున్నారు.
తాగు నీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టడంతో స్పందించిన అధికారులు గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్లు సరిచేసి శాశ్వతంగా నీరు సరఫరా చేయాల్సిందిపోయి ఇలా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయడం సరికాదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇకనైనా స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.
తాగు నీటికి తండ్లాట
కోటపల్లి, మార్చి 15 : కోటపల్లి మండలం రాజారం గ్రామస్తులు తాగు నీటి కోసం తల్లడిల్లుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో నెలరోజుల క్రితం బోరుబావి విద్యుత్ మోటర్ చెడిపోయింది. సుమారుగా వంద కుటుంబాలు ఉండే ఈ కాలనీలో నీటి సరఫరా లేకపోవడంతో గ్రామస్తులు సుదూర ప్రాతాలకు వెళ్లి కావడితో నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేసినా తమను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా కాలనీలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, ట్యాంక్‌ల ద్వారా నీరు సరఫరా చేస్తామన్నారు.