తాండూర్ : టీబీ ముక్త్ భారత్ ( TB Mukt Bharat ) అభియాన్ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని, టీబీ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడాలని తాండూర్ ( Tandoor ) పీహెచ్సీ వైద్యాధికారులు ఝాన్సీ, ప్రసన్న తెలిపారు. మండలంలోని అచ్చలాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో వైద్య సిబ్బంది టీబీ ముక్త్ భారత్ అభియాన్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీబీ వ్యాధి పూర్తిస్థాయి నివారణకు ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తుందన్నారు . ఆకలి మందగించడం, బరువు తగ్గడం(Weight Loss) , చెమటలు పట్టడం, గొంతు భాగంలో గడ్డలు ఏర్పడడం తదితర లక్షణాలుంటే టీబీ వ్యాధిగా గుర్తించాలన్నారు.
ఎవరికైనా వ్యాధి నిర్ధారణ అయితే వారికి ఉచితంగా మందులతో పాటు పౌష్టికాహారం, ప్రతినెల రూ. 1,000 బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. వైద్య శిబిరంలో సూపర్వైజర్లు తారాబాయి, రమాదేవి, ఎంఎల్హెచ్పీ, సీహెచ్వో ఓడ్నాల ప్రసన్న, పంచాయతీ సెక్రటరీ కల్పన, ఏఎన్ఎం కే ప్రవీణ, పారిజాత, పుష్పలత, ఎల్టీ హకీమ్, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.