ఇంద్రవెల్లి, మార్చి 27 : ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంట గ్రామ పంచాయతీ పరిధిలో గల గురువుదేవ్ చెరువులో నీరు ఇంకిపోవడంతో ఎడారిని తలపిస్తున్నది. దీని ఆయకట్టు పరిధిలో దాదాపు 70 ఎకరాల వరకు రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు.
చెరువుల నీటిపై అధారపడి జొన్న, గోధుమ, మక్క పంటలను సాగు చేశారు. నీరు అందకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం యాసంగి పంటలపై సర్వేలు నిర్వహించి ఎండిన పంటల రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
నా పేరు జాదవ్ లఖన్సింగ్. నాకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. చెరువులో నీరు లేకపోవడంతో కూరగాయలు సాగు చేయలేదు. చెరువులో నీరు ఉండి ఉంటే.. దాదాపు కూరగాయలు సాగు చేసి దాదాపు రూ.2 లక్షల పంట తీసేవాడిని. ఈ డబ్బులు నష్టపోవాల్సి వస్తున్నది. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోర్బావులు వేయడం లేదు.