ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సాగు నీటి వనరులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు, వ్యవసాయ బావుల్లోకి పుష్కలంగా నీరు చేరింది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల సాధారణం కంటే రికార్డు వర్షపాతం నమోదైంది. సోమవారం వరకు 447.2 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా.. 571.1 మిల్లీ మీటర్ల వాన పడింది. దీంతో రైతులకు రెండు పంటలకు సరిపడా సాగు నీరు పుష్కలంగా లభించనుంది.
ఆదిలాబాద్, జులై 24 ( నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా రైతులకు సాగునీరు కొరత ఉండేది. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వర్షాలపై ఆధారపడి వానకాలం పంటలను మాత్రమే సాగు చేసేవారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే పంటలకు అవసరమైన సమయంలో సాగునీరు లభించక నష్టపోవాల్సి పరిస్థితి ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో సాగునీటి వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. జిల్లాలో కొత్త ప్రాజెక్టులను నిర్మించడంతోపాటు పాత ప్రాజెక్టు ఆధునీకీకరణ, మిషన్ కాకతీయ పథకం లో భాగంగా చెరువుల మరమ్మతులు, కొత్త చెరువులు, చెక్ డ్యామ్‌ల నిర్మాణాలను చేపట్టింది. దీంతో రైతుల సాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. జిల్లాలో కొత్తగా చనాక, కొరాట, పిప్పల్‌కోటి ప్రాజెక్టులను నిర్మాణంతో పాటు సాత్నాల, మత్తడి వాగు ప్రాజ్టెకులను ఆధునికీ కరించగా, మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 219 చెరువులకు మరమ్మతులు చేపట్టారు. వీటి తో పాటు 46 చెక్‌డ్యామ్‌లను కొత్తగా నిర్మించారు. తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం సాగునీటి వనరుల అభివృద్ధి చేయడంతో జిల్లాలో 50 వేల ఎకరాల ఆయకట్టు పెరిగింది. ప్రభుత్వం జిల్లాలో సాగు నీటి పథకాలకు భారీగా నిధులు కేటాయించి అందుబాటులోకి తీసుకురావడంతో అన్నదాతలు రెండు పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
నిండుగా ప్రాజెక్టులు, చెరువులు
జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సాగునీటి వనరులు జలకళను సంత రించుకున్నాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, వ్యవసాయ బావుల్లోకి పుష్కలంగా నీరు చేరింది. చెక్‌డ్యామ్‌లు పొంగి ప్రవహిస్తు న్నాయి. వారం రోజుల క్రితం వరకు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో సోమవారం వరకు 447.2 మిల్లీ మీటర్ల వర్షం పడాల్సి ఉండగా, 571, 1 మిల్లీ మీటర్ల వాన పడింది. సిరికొండలో ఎక్కువగా ఇప్పటి వరకు 735.7 మిల్లీ మీటర్లు, ఇచ్చోడలో 729 మిల్లీ మీటర్లు, ఇంద్రవెల్లిలో 710.4 మిల్లీ మీటర్లు, గుడిహత్నూర్‌లో 624.8 మిల్లీ మీటర్లు, ఉట్నూర్‌లో 671.7 మిల్లీ మీటర్లు, నార్నూర్‌లో 600.9, నేరడిగొండలో 600.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సాత్నాల, మత్తడి ప్రాజెక్టుల్లోకి ఇన్‌ఫ్లో కొనసాగుతుం డడంతో సోమవారం అధికారులు గేట్లు ఎత్తి నీటిని బయటకు వదిలారు. ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో వానకాలం, యాసంగి పంటలకు పుష్కలంగా నీరు అందనుంది. రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారని, వానకాలం, యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంద ని అధికారులు అంటున్నారు.