లక్ష్మణ్చందా: మండలంలోని పీచర- ధర్మారం గ్రామాలను జంట గ్రామాలుగా పిలుస్తారు. ఇరు గ్రామాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారు. అలాంటి ఈ గ్రామాల మధ్య విద్యుత్ లైన్లు (Substation) చిచ్చుపెట్టాయి. దీంతో ఇరు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
కారణం ఏంటంటే..
12 ఏండ్ల క్రితం పీచరలో ప్రభుత్వం విద్యుత్ సబ్‌స్టేషన్‌ను నిర్మించింది. దీనికి అవసరమైన భూమిని పీచర గ్రామస్తులు కొనుగోలు చేసి సర్కారు అందజేశారు. ఆ దీని కోసం రూ.30 లక్షలు వెచ్చించారు. ఈ సబ్‌స్టేషన్ నుంచి పీచర, ధర్మారం, పారుపల్లిలోని కొంత భాగం, పొట్ట పెళ్లి శివారులోని కొంత భాగానికి వ్యవసాయ భూములకు విద్యుత్ సరఫరా జరుగుతుంది. పీచర గ్రామానికి ప్రత్యేకమైన సింగిల్ ఫేస్, త్రీ ఫేస్ విద్యుత్తు సప్లయ్ లైన్ ద్వారా గ్రామానికి విద్యుత్తు సరఫరా అవుతుంది. అయితే పీచర గ్రామం లాగే, తమ గ్రామానికి కూడా ప్రత్యేకమైన లైను ద్వారా సింగిల్ ఫేస్, త్రీ ఫేస్ విద్యుత్ సప్లయ్ కావాలని ధర్మారం ప్రజలు అధికారులను కోరారు. దీంతో వారికి విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక లైను మంజూరు చేశారు. ఇటీవల విద్యుత్తు లైను నిర్మాణ పనులను కూడా పూర్తి చేశారు. అయితే ధర్మారానికి వెళ్తున్న ప్రత్యేక లైనుకు కనెక్షన్ ఇచ్చే సమయంలో పీచర ప్రజలు అడ్డుకున్నారు. సబ్‌స్టేషన్ కోసం పూర్తి ఖర్చును తామే భరించామని, భూమి ఖరీదులో కొంత భాగాన్ని ధర్మారం గ్రామస్తులు భరించి ప్రత్యేక లైనును తీసుకెళ్లాలని కోరారు.
కానీ ధర్మారం గ్రామస్తులు పీచర గ్రామానికి ఎలాంటి డబ్బులు ఇవ్వలేమని తేల్చిచెప్పడంతో ప్రత్యేక లైన్ ద్వారా విద్యుత్తు అందించడం అడ్డుకుంటామని గ్రామస్తులు పేర్కొన్నారు. దాంతో ఇరు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల ఇరు గ్రామాల ప్రజలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఇరు గ్రామాల ప్రజలు పరస్పరం చర్చించుకుని సమస్యను పరిష్కారం చేసుకోవాలని ఎస్ఐ శ్రీనివాస్ ఇరు గ్రామాల ప్రజలకు సూచించారు.
అభివృద్ధిలో భాగస్వాములు కానిదే ప్రత్యేక లైను ఇవ్వం
మా గ్రామాభివృద్ధి కమిటీ సబ్‌స్టేషన్ నిర్మాణం కోసం అప్పులు చేసి నిర్మాణానికి సహాయపడిందని పీచరకు చెందిన అబ్బా భూమేష్ అన్నారు. దాంతో అధికారులు మా గ్రామానికి ప్రత్యేక లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అలాగే ధర్మారానికి గ్రామానికి కూడా ప్రత్యేక లైను ఇవ్వాలంటే వారు కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి టీచర్ ఆ గ్రామానికి కొంత ఆర్థిక సహాయం అందించి ప్రత్యేక లైను తీసుకెళ్లాలి.
రూపాయి ఖర్చు లేకుండా ప్రత్యేక లైను తీసుకెళ్లడం సరికాదు
ఎంతో ఖర్చును భరించి సబ్ స్టేషన్‌ను ఏర్పాటుకు సహకరించామని గ్రామానికి చెందిన తిప్పని శేఖర్ చెప్పారు. ఇప్పటికే ధర్మారం గ్రామానికి విద్యుత్ సరఫరా నడుస్తుంది. ఇంకా ప్రత్యేక లైను కావాలంటే తాము భరించిన ఖర్చులో వారు కొంత భరించాలి ధర్మారం గ్రామస్తులు ఖర్చును భరించలేమని చెప్పడం సరికాదు.