కాసిపేట : చనిపోతానని ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి, అటవీప్రాంతంలో అపస్మారక ( Unconscious ) స్థితిలో ఉండగా కాపాడి ఆసుపత్రికి తరలించి తన విధుల పట్ల నిబద్ధతను చాటుకున్నారు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ ఎస్సై గంగారాం( SI Gangaram).
కాల్వల తిరుపతి అనే వ్యక్తి భార్యతో గొడవ పడి తాను చచ్చిపోతానని ఉదయం.ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇంట్లో వెతికినా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు దేవాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన ఎస్సై గంగారాం సాంకేతిక పరిజ్ఞానంతో గంట వ్యవధిలోనే ఆచూకి కనిపెట్టారు. దేవాపూర్లోని సల్పాలవాగు సమీప అటవీ ప్రాంతంలో ఉన్నాడని గుర్తించి తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. మోతాదుకు మించి టాబ్లెట్లు వేసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో అపస్మరకస్థితిలోకి వెళ్లిపోయాడు.
అటవీ ప్రాంతంలో చెట్టు కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న తిరుపతిని అక్కడి నుంచి తరలించి చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఎస్సై గంగారాం సేవలను పలువురు కొనియాడారు.