సిర్పూర్(టీ), సెప్టెంబర్ 9 : సిర్పూర్(టీ) మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టింది. రెండు రోజుల్లో దాదాపు 35 మంది విద్యార్థులు జ్వరం బారిన పడ్డారు. ఆదివారం 23 మంది విద్యార్థులకు ఒకేసారి జ్వరం రాగా, ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా గురుకుల పాఠశాలను పరిశీలించారు.
విద్యార్థులను వెంటనే సిర్పూర్(టీ) సామాజిక దవాఖానకు తరలించారు. అక్కడ సరిపడా బెడ్లు లేకపోవడంతో తిప్పలు పడాల్సి వచ్చింది. వెంటనే గురుకుల పాఠశాల నుంచి 10 డబుల్ బెడ్లను దవాఖానకు తీసుకొచ్చారు. అనంతరం ఆ బెడ్లపై విద్యార్థులకు చికిత్స అందించారు. సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఎంఅండ్‌హెచ్‌వో అక్కడే ఉండి మెరుగైన వైద్య సేవలందేలా చూశారు. అదేరాత్రి మరో ముగ్గురు విద్యార్థులకు కూడా జ్వరం రావడంతో అప్పటికప్పుడు దవాఖానకు తరలించారు. సోమవారం కూడా మరో 8 మంది విద్యార్థులకు జ్వరం రావడంతో హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.
సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఆపై దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. గురుకులంలో ఎంత మందికి జ్వరం వచ్చిందో రిపోర్టు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం చికిత్స తీసుకున్న 26 మంది విద్యార్థుల్లో.. 16 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించగా, ఇంటికి తీసుకెళ్లారు. అదనపు కలెక్టర్ వెంట డీఎల్పీవో, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సత్యనారాయణ, మెడికల్ అధికారులు డాక్టర్ నవత, అనూష ఉన్నారు. కాగా, దాదాపు 34 మంది విద్యార్థులకు జ్వరాలు వచ్చినట్లు పాఠశాల, వైద్య సిబ్బంది చెబుతుండగా, అనధికారికంగా దాదాపు 100 మందికిపైగా విద్యార్థులకు జ్వారాలు వచ్చినట్లు తెలుస్తున్నది.