ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 28 : విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని శ్రాస్తవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనాక్ 52వ బాలల వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. ఎమ్మె ల్యే కోవ లక్ష్మి, డీఈవో యాదయ్యతో కలిసి పాల్గొని ఆయన మాట్లాడారు. విద్యార్థులు సైన్స్, గణితాన్ని ఇష్టపడి చదివి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. నేను సైన్స్, గణితంలో వందకు వంద మారులు తెచ్చుకున్నానని తెలిపారు. సమస్యకు పరిషారం చూపడానికి, నూతన ఆవిష్కరణలకు సైన్స్, గణితము దోహదపడుతాయన్నారు.
విద్యార్థులు ఇదే స్ఫూర్తితో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచాలని సూచించారు. ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి బాధ్యతాయుత పౌరులన్నారు. విద్యా అవకాశాలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వాలు సరైన వసతులు కల్పించాల్సిన అవసరముందన్నారు. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి వాటి పనితీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంసృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఢిల్లీ సీనియర్ అసోసియేట్ శుభదీప్ బెనర్జీ, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, సెయింట్ మేరీ పాఠశాల ప్రిన్సిపాల్ త్రిష్యమ్మ, ఎంఈవో వాసాల ప్రభాకర్, డీఈవో కార్యాలయం ఎఫ్ఏవో దేవాజీ, ఏసీజీ ఈ ఉదయ బాబు, ఆసిఫాబాద్ ఎమ్మార్వో సుభాష్, ఏసీఎంవో ఉద్ధవ్, కార్యక్రమ కో కన్వీనర్, జిల్లా సైన్స్ అధికారి కటకం మధూకర్, అధికారులు, నాయకులు ధర్మపురి వెంకటేశ్వర్లు, చారి, ఊశన్న పాల్గొన్నారు.