నార్నూర్ : ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మకమైన (Quality education ) విద్యనందించాలని సమగ్ర గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్ ( Yuvraj Marmat ) ఉపాధ్యాయులకు సూచించారు.
బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, తాడిహత్నూర్ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. రికార్డులు, తరగతి గదులు, పరిసరాలు పరిశీలించారు. వంటశాలలో వంటకాలు పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, విద్యార్థులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందిస్తుందన్నారు.
మెనూ పాటిస్తూ పోషక విలువలతో కూడిన భోజనం వడ్డించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అనంతరం కాటన్ మిల్లును సందర్శించారు. పత్తి తేమశాతంపై ఆరా తీశారు. రైతులకు ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు చేయాలని సూచించారు. స్థానిక తహసీల్ కార్యాలయాన్ని సందర్శించారు.