కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు (Students rally ) మాదకద్రవ్యాలకు ( Drug addiction ) వ్యతిరేకంగా మంగళవారం ర్యాలీ ( Rally ) నిర్వహించారు. ‘మత్తుకు యువత జీవితం-చిత్తు కాకూడదు’ అనే అంశంపై వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, సోషల్ వర్కర్లు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలు, సిగరెట్, గుట్కా, గంజాయి, బీడీ, కోకయిన్ వంటి డ్రగ్స్‌పై అవగాహన కల్పించారు. వ్యసనాలకు యువత ఆకర్షితులైతే, శారీరక, మానసిక రుగ్మతలకు గురికావాల్సి వస్తుందని అన్నారు. వీటి బారిన పడితే అనారోగ్యానికి గురై జీవితాంతం బాధపడాల్సి వస్తుందని , తల్లిదండ్రులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.
విద్యార్థులు లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం సట్ల గంగాధర్, కుభీర్ మండల విద్యా కమిటీ మాజీ సభ్యులు నాగేష్, తదితరులు వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సోషల్ వర్కర్లు పండరి, లక్ష్మణరావు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.