కుమ్రం భీం ఆసిఫాబాద్ నమస్తే తెలంగాణ/ కెరమెరి జూలై 15: ఆశ్రమ పాఠశాల, గురుకులాల్లో అధికారుల నిర్లక్ష్యంతో అందులోని పేద విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. చదువుల సంగతి ఎలా ఉన్నా కనీసం కడుపునిండా అన్నం తినలేని పరిస్థితి నెలకొన్నది. వసతి గృహాల్లో నెలకొన్న దుస్థితిపై ప్రశ్నించిన విద్యార్థులను వేధింపులకు గురి చేయడం లేదా టీసీలు ఇచ్చి పంపేయడం ఆనవాయితీగా మారుతున్నది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో విద్యార్థుల ఇబ్బందులు తప్ప డం లేదు. ఆశ్రమాల్లో విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు విద్యార్థులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొన్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొన్న కాగజ్‌నగర్‌లో మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యార్థులు ఆందోళన చేపట్టగా, నిన్న(మంగళవారం) రాత్రి కెరమెరి మండలంలోని హట్టి పాఠశాల విద్యార్థులు రాత్రి రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. జిల్లాలోని గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారం లభిస్తుందనే నమ్మకం సన్నగిల్లుతున్నంది. పాఠశాలలో నిర్వహణను ఎలాంటి లోపాలు లేకుండా చూడాల్సిన ప్రిన్సిపాల్, వార్డెన్లు పాఠశాలల నిర్వహణను గాలికి వదిలేస్తున్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మహ్మాత్మా జ్యోతిబాఫూలే గురుకులల్లో ప్రిన్సిపాల్, పీఈటీలు వేధిస్తున్నారని విద్యార్థులు ఇటీవల ఆందోళన చేపట్టారు. అకారణంగా విద్యార్థులను కొట్టడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
పాఠశాలలో తమకు విద్య, భోజనాలు సరిగా అందడం లేదని ప్రశ్నించే విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపిస్తున్నారని ఇప్పటివరకు దాదాపు 20 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపేశారని విద్యార్థులు ఆరోపించారు. కెరమెరి మండలంలోని హట్టి ఆశ్రమ పాఠశాలల్లో కొన్ని రోజులుగా విద్యార్థులకు సరిగా భోజనాలు పెట్టడం లేదని, నీళ్ల పప్పు, సరిగా ఉడకని అన్నం పెడుతున్నారని ఆరోపిస్తూ మంగళవారం రాత్రి విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. భోజనాలు చేయకుండా రాత్రి 10 గంటల వరకు వేచిచూసిన విద్యార్థులు నీళ్ల చారు అన్నం ప్లేట్లతో రోడ్డెక్కాల్సివచ్చింది. ఈ పాఠశాలలో హెచ్ఎం వార్డెన్ ఒక్కరే కావడంతో హెచ్ఎం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. కొద్ది రోజులుగా ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పాటించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్లక్ష్యంపై కఠిన చర్యలు కరువు !
జిల్లాలోని ఐటీడీఏ ఆశ్రమాలు, ఇతర గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు పడుతున్న అవస్థలకు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాసిరకం భోజనాలు పెడుతున్నారని, సమస్యలు పరిష్కరించడం లేదని విద్యార్థులు బయటికొచ్చి రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే తప్ప ఉన్నతాధికారులు స్పందించే స్థితుల్లో లేరు. హట్టి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సరైన భోజనాలు పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎంపై ఐటీడీఏ పీవో మంద మకరందు బదిలీ వేటు వేశారు. ఇలాంటి నామమాత్రపు చర్యలతోనే ఆశ్రమ పాఠశాలలో వార్డెన్‌గా పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఎలాంటి భయం లేకుండా పోయింది. మెనూ పాటించకుండా విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతూ ఆశ్రమ పాఠశాల్లోని గిరిజన పేద విద్యార్థుల కడుపులు మాడ్చుతున్న వారిపై ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.