దండేపల్లి, జూలై18 : తాళ్లపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కృషితో విద్యార్థుల సం ఖ్య పెరిగింది. ఇంటింటికీ వెళ్లి పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి మరీ 50కి పైగా అడ్మిషన్లు చేయించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
విద్యా సంవత్సరం ప్రారంభంలో 36 మంది మాత్రమే ఉండగా, ప్రస్తుతం 90 మందితో స్కూల్ కళకళలాడుతున్నది. ఇక ప్రస్తుతం ముగ్గురే ఉపాధ్యాయులుండగా, విద్యార్థుల సంఖ్యకనుగుణంగా సిబ్బందిని కేటాయించాలని ఇన్చార్జి హెచ్ఎం ప్రభాకర్, గ్రామస్తులు కోరుతున్నారు.
తాళ్లపేట ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉండగా, ప్రస్తుతం 90 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. ఈ యేడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు 36 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలలో ఉన్నారు. 36 మందికి ఐదుగురు ఉపాధ్యాయులు విద్యా బోధన చేశారు. జూన్‌లో హెచ్ఎంగా పనిచేసిన జగదీశ్వర్‌గౌడ్ ఉద్యోగ విరమణ చేశారు.
ఇక సరిపడా విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో విద్యాధికారులు సర్దుబాటులో భాగంగా మరొక ఉపాధ్యాయురాలిని రెబ్బెన్‌పెల్లి పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించారు. ఇక మిగిలిన ముగ్గురు ఉపాధ్యాయులు ప్రభాకర్, రామరాజు, శ్రీనివాస్ బడి ని బతికించుకోవాలని నిర్ణయించి ఇంటింటా తిరిగి విద్యార్థుల సంఖ్యను పెంచారు.
తాళ్లపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఈ యేడాది (2025-26) ప్రారంభంలో ఒకటి నుంచి ఐదు తరగతులకు కలిపి 36 మాత్రమే ఉండేది. ఈ నేపథ్యంలో బడిని బతికించుకునేందుకు ఉపాధ్యాయులు ప్రభాకర్, రామరాజు, శ్రీనివాస్ ఒక్కటయ్యారు. బడిబాటలో భాగంగా పట్టుదలతో ఇంటింటా తిరిగారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అన్ని సౌకర్యాలున్న బడిలోనే పిల్లలను చేర్పించాలని, ప్రైవేట్‌కు పంపించవద్దంటూ అవగాహన కల్పించారు.
ఇంకేముంది గ్రామస్తులంతా ఒక్కటే తమ పిల్లలను సర్కారు బడిలో చేర్పించారు. ప్రస్తుతం 90 మంది విద్యార్థులతో బడి కళకళలాడుతుండగా, గ్రామస్తులతో పాటు మండల విద్యాధికారులు ఉపాధ్యాయులను అభినందిస్తున్నారు. కాగా, విద్యార్థుల సంఖ్య పెరిగినా ఐదు తరగతులకు కేవలం ముగ్గురే ఉపాధ్యాయులు ఉండడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉపాధ్యాయురాలిని తిరిగి పాఠశాలకు పంపించాలని గ్రామస్తులు, పోషకులు కోరుతున్నారు. తాళ్లపేట పాఠశాలకు సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని ఇన్చార్జి హెచ్ఎం ప్రభాకర్ కోరుతున్నారు.