మంచిర్యాల (ఏసీసీ), ఏప్రిల్ 6 : పేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు బ్లడ్ క్యాన్సర్ బారిన పడడంతో అల్లాడుతున్నది. ప్రాణాంతక రోగానికి చికిత్స చేయించేందుకు లక్షల్లో ఖర్చవుతుందని తెలిసి ఆందోళన చెందుతున్నది. అయినా కొడుకును బతికించుకునేందుకు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సయ్యద్ అలీ.. స్థానికి ఆర్డీవో ఆఫీసులో హోంగార్డుగా పని చేస్తున్నాడు.
ఇద్దరు కొడుకులు కాగా, పెద్ద కొడుకు కరీం (21) గతేడాది చదువు నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. అనారోగ్యంతో పాటు తరచూ జ్వరం వస్తుండడంతో మంచిర్యాలకు తీసుకువచ్చి, స్థానికంగా చూపించారు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతోపాటు ప్లేట్ లెట్లు తగ్గిపోవడంతో వైద్యుల సలహాపై పరీక్షలు చేశారు. బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. ప్రస్తుతం చికిత్స కోసం హైదరాబాద్లోని బసవతారకం దవాఖానలో చికిత్స తీసుకుంటున్నాడు.
కాగా, చికిత్సకు రూ.15 లక్షలపైగా అవసరమవుతుందని తెలియడంతో ఆ కుటుంబం ఆందోళన చెందుతున్న ది. కనీసం సొంత ఇల్లు కూడా లేని తమకు, కొడుకు ను ఎలా బతికించుకోవాలో తెలియని సందిగ్ధంలో పడిపోయింది. ఇప్పటికే శక్తికి మించి అప్పు చేసి, రో జూ చికిత్స చేయిస్తున్న ఆ కుటుంబం దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది. తోచిన సాయం చేయాలని వేడుకుంటున్నది. అందుకు 98660 34012, 93812 15299 నంబర్లకు పోన్ పే, గూగుల్ పే ద్వారా సాయం అందించాలని కోరుతున్నది.