ఎదులాపురం,ఏప్రిల్29: కానిస్టేబుల్ తుది రాత పరీక్షకు కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా పోలీస్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు ఉదయం 8.45 గంటలకు కేంద్రాలను చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల పరీక్ష ఉంటుందని తెలిపారు. 12 పరీక్షా కేంద్రా ల్లో అడిషనల్ ఎస్పీ, 3 డీఎస్పీలు, 11 సీఐలు, 3ఆర్ సీఐలు, 17ఎస్ఐలు, 3 మహిళా ఎస్ఐలు, 28 ఏఎస్ఐలు, 4 మహిళా ఏఎస్ఐలు, 60 మంది హెడ్ కానిస్టేబుల్, 60 మంది కానిస్టేబుళ్లు, 24 మంది మహిళ కానిస్టేబుల్, అత్యవసర సమయంలో 36ఏఆర్ సిబ్బంది ఈ పరీక్షల విధులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సీ సమయ్ జాన్‌రావు, డీఎస్పీలు వీ ఉమేందర్, ఉమామహేశ్వర రావు, పీ శ్రీనివాస్, జిల్లాలోని సీఐ,ఎస్ఐలు ఉన్నారు.