తాంసి : తెలంగాణలోని ఆదిలాబాద్( Adilabad) , మహారాష్ట్ర ( Maharastra ) సరిహద్దులో అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం ఇవ్వకుండా నేరాల నియంత్రణ తగు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan) అన్నారు. శనివారం తాంసి పోలీస్ స్టేషన్ ను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. మండలంలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు ( Drunk and Drive) నిర్వహిస్తూ , రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సూచించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులను గౌరవంగా వ్యవహరిస్తూ , రిసెప్షన్ సెంటర్లో ప్రతి ఒక్క ఫిర్యాదుని నమోదు చేసుకొని సత్వర పరిష్కారం అందించే దిశగా కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో పరిశుభ్రత పాటించాలని, ఫిర్యాదుదారులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కోర్టు డ్యూటీ విధులను ఎస్సైలు నిరంతరం పర్యవేక్షిస్తూ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. నేరస్థులకు శిక్షలు పడినప్పుడే నేరాల సంఖ్య తగ్గుముఖం పడుతుందని అన్నారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ రూరల్ సీఐ కె ఫణిదర్, ఎస్సై ధడక రాధిక, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.