పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుండెగాం పునరావాస చర్యలకు రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టగా, ఆ ఊరి ప్రజల గోస తీరబోతున్నది. గత పాలకుల పట్టింపులేని తనంతో ఏటా వర్షాలకు నరకం అనుభవిస్తూ వచ్చిన వారి సమ ఎట్టకేలకు పరిష్కారాం దొరకబోతున్నది. ఇటీవల ప్రభుత్వం పునరావాసం, ముంపు సమస్య పరిష్కారంతోపాటు అదనపు భూ సేకరణ, కాలువలు, అభివృద్ధి కోసం రూ.60 కోట్లు మంజూరు చేయగా, ఇందులో రూ. 26 కోట్లు బాధితులకు కేటాయించింది. 271 ఇళ్లకు పరిహారం అందించేందుకు కసరత్తు చేస్తున్నది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రత్యేక చొరవతో శాశ్వత పరిష్కారం లభిస్తుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
నిర్మల్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా భైంసా మండల పరిధిలో గల పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు ముంపు గ్రామమైన గుండెగాం పునరావాస చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు రెండు దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని పునరావాస పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో పరిష్కారం లభించింది. నాటి ఉమ్మడి పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారికి పునరావాసం కల్పించకపోవడంతో ప్రతిసారి వానకాలం వచ్చిందటే గ్రామస్తులంతా బిక్కు బిక్కు మంటూ గడపాల్సిన దుస్థితి నెలకొన్నది.
యేటా వానకాలంలో ఈ గ్రామం ముంపునకు గురికావడం, అలాగే గ్రామస్తులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం పరిపాటిగా మారింది. ఈ సమస్య గ్రామస్తులకు ప్రాణసంకటంగా.. అధికారులకు కత్తిమీద సాములా మారింది. ప్రతి ఎన్నికల సమయంలో కూడా అప్పటి పాలకులకు గుండెగాం గ్రామ పునరావాసం, పరిహారం ప్రధాన హామీగా మారింది. ఈ హామీలన్నీ బుట్ట దాఖలయ్యాయి. గ్రామస్తులు ఏళ్ల తరబడి తమ సమస్య పరిష్కారానికి అనేక రకాల ఆందోళనలు చేశారు. అప్పటి ప్రభుత్వాలు గ్రామస్తుల ఆందోళనపై ఉక్కుపాదం మోపినప్పటికీ, వారు మాత్రం వెనకడుగు వేయకుండా నిలదీస్తూనే వచ్చారు.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రాజెక్టుల కింద ముంపునకు గురైన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే గుండెగాం గ్రామ ధీనావస్థను స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం స్పందించి గుండేగాం పునరావాస చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు పరిహారం, పునరావాస చర్యలు మొదలు పెట్టారు. ఇళ్లు, ఇంటికి సంబంధించిన ఖాళీ స్థలాల నష్టంపై సర్వే చేపట్టాలని కొద్దిరోజుల క్రితం రెవెన్యూ శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేయగా, ఇటీవలే సర్వే పూర్తయింది.
ఈ సర్వే ద్వారా గుండెగాం గ్రామంలో మొత్తం 271 ఇళ్లు ముంపునకు గురవుతున్నట్లు నిర్ధారించారు. అలాగే ఆయా ఇళ్లకు సంబంధించి 15.719 చదరపు గజాల ఖాళీ స్థలాలు కూడా ముంపునకు గురైనట్లు తేల్చారు. ఇటు ఇళ్లకు సంబంధించి, అటు ఖాళీ స్థలాలకు సంబంధించి పరిహారం ఇవ్వాల్సి ఉంటుందని నివేదికలు రూపొందించారు. ఈ నివేదికలను ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వం పాత పద్ధతిలో పరిహారం అందించవచ్చని భావించిన గ్రామస్తులు తొలుత కొంత ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని మరోసారి వారు స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి, ఎమ్మెల్యే ఇద్దరు ఈ పరిహారానికి సంబంధించి ప్రభుత్వానికి వివరించడంతో 2013 ఆర్అండ్ఆర్ చట్టం ప్రకారం పరిహారాన్ని అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ వల్లనే సాధ్యమైంది..
గుండెగాం గ్రామ సమస్య ఇప్పటిది కాదు. దాదాపు 20 ఏండ్ల నుంచి బాధలు పడుతున్నం. వానకాలం వస్తుందంటేనే భయపడే వాళ్లం. ఎన్నో సార్లు నిద్ర లేని రాత్రులు గడిపాం. ముఖ్యమంత్రి కేసీఆర్ చల్లని చూపుతో మా సమస్యకు పరిష్కారం దొరుకుతున్నది. వచ్చే వానకాలం నాటికి పునరావాసం కల్పిస్తామని అధికారులు చెబుతున్నరు. మా ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కూడా గ్రామస్తులకు భరోసా ఇచ్చారు.
– చంద్రకాంత్, గుండెగాం, భైంసా మండలం
వరదలకు నా ఇల్లు కూలింది..
పదేండ్ల కింద భారీ వర్షాలు, వరదలకు నా ఇల్లు కూలింది. అప్పటి నుంచి ఊరిలోనే తెలిసిన వారి ఇంట్లో కిరాయికి ఉంటున్న. నా భర్త అనారోగ్యంతో కాలం చేసిండు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తోనే బతుకుతున్న. వానకాలం వస్తే చిన్న సుద్ద వాగు నీళ్లతో ఊరు మునిగి పోతది. ఇక్కడి నుంచి కొత్తూరికి పంపిస్తమని మొన్ననే ఆఫీసర్లు వచ్చి నా కూలిన ఇళ్లును కొలుసుక పోయిన్రు. కొత్త ఇళ్లు కట్టిస్తే కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటా.
– బామన్పెల్లి కాంతాబాయి, గుండెగాం, భైంసా మండలం.
తెలంగాణ వచ్చినంక నమ్మకం కలిగింది..
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ఊరికి మేలు జరుగుతున్నదని నమ్మిన. అనుకున్నట్లే సీఎం కేసీఆర్ గుండెగాంకు పైసలు మంజూరు చేసిండు. ఇంతకు ముందు మమ్మల్ని ఎవరూ పట్టించు కోలేదు. ఎలక్షన్లప్పుడు ఓట్లకోసం వచ్చి ఉత్త మాటలు చెప్పేటోళ్లు. కేసీఆర్ సారు వల్లనే మా ఊరి సమస్యకు పరిష్కారం దొరికింది. ఇటీవల తహసీల్ ఆఫీసు వాళ్లు ఇక్కడికి వచ్చి మా ఇండ్ల కొలతలు చేసిన్రు. రెండు మూడు నెలల్లో మీ కష్టాలు దూరమయితయ్ అన్నరు. చాలా సంతోషంగా ఉన్నది.
– సూర్యవంశీ ప్రసాద్, గుండెగాం, భైంసా మండలం.
271 ఇళ్లకు అందనున్న పరిహారం
గుండెగాంలో మొత్తం 271 ఇళ్లు ప్రాజెక్టు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ప్రభుత్వం 271 ఇళ్లతోపాటు వాటికి సంబంధించిన ఖాళీ స్థలాలకు పరిహారం అందించేందుకు సిద్ధమైంది. మొదటి నుంచి పరిహారం నిర్ధారణ అంశంతోపాటు, మార్కెట్ విలువ తదితర క్షేత్రస్థాయి సమస్యల కారణంగా ఈ అంశం ముందుకు సాగలేదు. అయితే జిల్లాలోని మిగతా ప్రాజెక్టుల కింద ముంపునకు గురైన వ్యవసాయ భూములు, ఇళ్లకు 2013 ఆర్అండ్ఆర్ చట్టం కింద పరిహారం అందించడంతో.. గుండెగాం గ్రామస్తులు కూడా తమ ఇళ్లకు అదే తరహాలో పరిహారం అందించాలని కోరారు. దీనిపై ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కసరత్తు జరిపి సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. అనంతరం జిల్లా అధికారుల సిఫారసుల మేరకు 2013 ఆర్అండ్ఆర్ చట్టం కింద పరిహారం అందించేందుకు సిద్ధమైంది.