మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ) : డబ్బు ఐదేండ్ల స్వతంత్య్ర భారతావనిలో అతివలకు ప్రోత్సాహం కరువైంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నారు. పాలకుల పట్టింపులేని తనంతో కనీస పథకాల అమలుకు నోచుకోలేదు. ఇటువంటి సమయంలో బీఆర్ఎస్ సర్కారు బాసటగా నిలుస్తున్నది. ఆకాశంలో సగం, అవనిలో అర్ధభాగమైన ఆమె సంక్షేమం, అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. వందల సంఖ్యలో పథకాలు అమలు చేస్తున్నది. ముసలవ్వలకు పెద్దకొడుకులా.. ఆడబిడ్డలకు అన్నలా.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మేనమామలా కేసీఆర్ ఉంటున్నడు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ఇంట్లో వెలుగులు నింపుతున్నాడు. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, బాలింతలకు కేసీఆర్ కిట్లు అందిస్తూ ప్రజా సంక్షేమానికి పాటు పడుతున్నాడు. మగువలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటూ భరోసాగా బతుకుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తున్నది. ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా రూ.1,00,116 అందిస్తూ కేసీఆర్ పెద్దన్నలా నిలుస్తున్నాడు. ఒంటరి, వితంతువు, బీడీ కార్మికులకు పెద్దకొడులా ఉంటున్నడు. ప్రభుత్వం గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు, బాలింతలకు కేసీఆర్ కిట్లు అందిస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్నది. మాతా, శిశు సంరక్షణే లక్ష్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు కేసీఆర్ కిట్ల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణులకు రక్తం తక్కువగా ఉంటుండడంతో ప్రసవ సమయంలో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను నివారించేందుకు పౌష్టికాహార కిట్లను అందిస్తున్నది.
ఆసిఫాబాద్ జిల్లాలోని 22 పీహెచ్సీల పరిధిలో 4,043 పౌష్టికాహార కిట్లు గర్భిణులకు అందాయి. దవాఖానలో డెలివరీ అయిన వారికి రూ.4.79 కోట్ల నగదు ఇచ్చారు. 15,190మందికి కేసీఆర్ కిట్లు అందాయి. నెలనెలా ప్రభు త్వం వితంతు పెన్షన్లు 22,251, ఒంటరి మహిళల పింఛ న్లు 2,624, బీడీ కార్మిలకు పెన్షన్లు 87 మందికి అందిస్తోం ది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా తొమ్మిదేళ్లలో 21,412 మంది ఆడపిల్లల పెడ్లిళ్లకు రూ.196కోట్లు ఇచ్చారు.
నిర్మల్ జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ ద్వారా 30,632 మందికి ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున రూ.306.70 కోట్లు అందించింది. వితంతు 37,658 మంది, ఒంటిరి మహిళలు 2,146 మందికి నెలనెలా పింఛన్ అందుతున్నది. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా 40,090 మంది లబ్ధి పొందారు. కేసీఆర్ కిట్ 28,096 మందికి అందించారు. ఆరోగ్య మహిళ పథకం ద్వారా 1,874 మంది వైద్యసేవలు అందించారు. న్యూట్రిషియన్ కిట్లను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ల ద్వారా 29,082 మందికి రూ.264.18 కోట్లు పంపిణీ చేశారు. ఆసరా పథకం ద్వారా ఒంటరి మహిళలు 2,272, బీడీ కార్మికులు 5,538, 29,054 మందికి వితంతు పింఛన్లు అందిస్తున్నారు. న్యూట్రిషియన్ కిట్లు 6,711 మందికి అందించారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా 12,851 మంది మహిళలకు లబ్ధిచేకూరింది. కేసీఆర్ కిట్లు 39,065 మందికి అందించారు.
మంచిర్యాల జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ ద్వారా 33,000 మందికి రూ.298.64 కోట్లు అందించారు. వితం తు పింఛన్లు 41,478, బీడీ కార్మికులు 357, ఒంటరి మహిళలు 2,572 మంది పెన్షన్ తీసుకుంటున్నారు. కేసీఆర్ కిట్లు 26,856 మందికి రూ.26.59 కోట్లు అందించారు. ఆరోగ్య మహిళా పథకం ద్వారా 2,780 మందికి చికిత్సలు అందించారు.
ప్రతి రోజూ అంగన్వాడీ కేంద్రానికి పోత
గర్భిణులు, బాలింతలు బాగుండాలని ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకం అమలు చేస్తుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందిస్తున్నరు. నేను ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రానికి పోత. పౌష్టికాహారం తీసుకుంట. ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్వాడీ కేంద్రాలకు సన్నరకం బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది. – జే. సరిత, ఖానాపూర్
రెండు కాన్పులకు కేసీఆర్ కిట్లు ఇచ్చిన్రు
సర్కారోళ్లు ప్రభుత్వ దవాఖానలో కానుపు చేయించుకుంటే కేసీఆర్ కిట్ ఇస్తున్నరు. ప్రైవేట్ దవాఖానలకు ఏం తక్కువ కాకుండా సర్కారు దవాఖాన్ల కూడా మంచిగ చూస్తున్నరు.నా మొదటి కాన్పు కడెం ప్రభుత్వ దవాఖాన్లనే చేయించుకున్న. రెండో కాన్పు కోసం నిర్మల్ దవాఖానకు వచ్చిన . రెండుసార్ల కేసీఆర్ కిట్లు ఇచ్చిన్రు. కిట్లో 16 రకాల వస్తువులున్నయి. ఇవి బయట కొంటే మస్తు ఖర్చయ్యేది. సీఎం కేసీఆర్ సార్ పేదోళ్ల కోసం మస్తు మంచి పనులు చేస్తున్నడు.
– రాజమణి, బాలింత, లింగాపూర్, కడెం
ప్రైవేటు దవాఖానకు పోతె బోలెడు ఖర్చయ్యేది
నిర్మల్ చైన్గేట్, జూన్ 12 : నాకు గర్భాశయంలో సమస్య వచ్చింది. నిర్మల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా క్లినిక్కు వచ్చిన. ఇక్కడ అన్ని రకాల పరీక్షలు చేసిన్రు. మందులు కూడా ఇచ్చిన్రు. రోజూ వాడుతున్న. ఇప్పుడు ఆరోగ్యం కొంత మంచిగనే ఉంది. ఇక్కడ పైసా ఖర్చు కాలే. అదే ప్రైవేట్ దవాఖానకు పోతె బోలెడు ఖర్చయ్యేది. సీఎం కేసీఆర్ మాలాంటి పేదోళ్లకు మేలు చేస్తున్నరు. ఆయన సల్లంగుండాలె.
– పత్రి అనసూయ, నిర్మల్
నా బిడ్డ పెండ్లికి సాయం చేసిన్రు
నా పేరు ఆరెపల్లి బానక్క. మాది బెజ్జూర్. కూలీనాలీ చేస్కొని బతుకుతం. నా బిడ్డ పెండ్లి ఎట్ల చేసుడోనని మస్తు రందిపడ్డ. నిరుడు పెండ్లి సంబంధం కుదిరింది. సుట్టాల దగ్గర అప్పు చేసి బిడ్డ పెండ్లి మంచిగ చేసిన. ఆ తర్వాత కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసిన. జెప్పన్నే చెక్కు ఇచ్చిన్రు. రూ. లక్షా నూట పదహార్లు వచ్చినయ్. గా డబ్బులను బ్యాంకు నుంచి విడిపించి బాకీ కట్టిన. నా బిడ్డ పెండ్లి కొండంత సాయం చేసిన సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటం.
– ఆరెపల్లి బాణక్క, బెజ్జూర్
ఇద్దరి బిడ్డలకు కల్యాణలక్ష్మి చెక్కులిచ్చిన్రు
భీంపూర్, జూన్ 12 : నా పేరు గెడాం లక్ష్మీబాయి. మాకు రెండెకరాలు ఉంది. నా భర్త మారుతి.. నేను ఎవుసం చేస్కుంటం. మాకు ఇద్దరు బిడ్డలు ప్రియాంక, అనురాధ ఉన్నరు.అప్పు చేసి కొన్ని నెలల కింద ఇద్దరికీ పెండ్లిళ్లు చేసినం. సార్లు చెబితే కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నం. మొన్న దశాబ్ది పండుగ నాడు ఎమ్మెల్యే బాపురావ్ సారు ఇద్దరి బిడ్డలకు కల్యాణ లక్ష్మి చెక్కులిచ్చిన్రు. నాకు కండ్లళ్ల నీళ్లు తిరిగినయ్. గీ డబ్బులతో బాకీ కడ్తం. ఇంకా కొన్ని మిగుల్తయి. సీఎం కేసీఆర్ రైతుబంధు కింద సాయం చేసిండు. ఇపుడు మళ్లా ఇద్దరి బిడ్డల పెండ్లికి మేనమామ తీరు ఆసరా అయ్యిండు. బతికున్నంత కాలం గాయనను తల్సుకుంటం.