కుభీర్, నవంబర్ 1 : కుభీర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ వద్ద శనివారం సోయా కొనుగోళ్ల టోకెన్ల జారీ ప్రక్రియలో తొక్కిసలాట జరిగింది. టోకెన్లు జారీ విషయాన్ని తెలుసుకొని శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు తరలివచ్చారు. ఉదయం 10 గంటల వరకు ప్రాంగణం రైతులతో నిండి రైతులు క్యూలో నిలబడ్డారు. ఈ క్రమంలో కార్యాలయం గద్దె పైనుంచి ఒక్కసారి వెనక్కి నెట్టడంతో రైతులు గద్దె పైనుంచి కిందపడిపోయారు. ఒకరినొకరు తోసుకోవడం వల్ల ఊపిరాడక సతమతం అయ్యారు. దీంతో లక్ష్మి, చంద్రకళ అనే రైతులతోపాటు మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇందులో లక్ష్మి, చంద్రకళల కాళ్లు ప్యాక్చర్ అయ్యాయి. వీరికి కుభీర్ పీహెచ్సీలో ప్రాథమిక చికిత్స చేసి, కుటుంబీకులు భైంసాకు తరలించారు. కుభీర్ ఎస్సై, సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు నానా తంటాలు పడ్డారు. భైంసా రూరల్ సీఐ నైలు నాయక్ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
ఆధార్, బ్యాంకు ఖాత, పట్టా పాసుపుస్తకం జిరాక్సు ప్రతులు ముందుగా స్వీకరించారు. అనంతరం మైకు ద్వారా అనౌన్స్ చేస్తూ ఒక్కో రైతును పిలిచి టోకన్ల జారీ ప్రక్రియను చేపట్టారు. 76 గ్రామాలు, 43 జీపీలతో నిర్మల్ జిల్లాలోనే మండలం అతి పెద్దది కావడం 25 వేలకు పైగా ఎకరాల్లో ఈయేడాది ఖరీఫ్‌లో రైతులు సోయా సాగు చేశారు. కొనుగోలు కేంద్రం మాత్రం ఒక్కటే కావడం, రైతువేదికల ఆధ్వర్యంలో టోకన్ల జారీ చేపట్టక పోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని రైతులు మండిపడ్డారు. మండల కేంద్రం కుభీర్తోపాటు మాలేగాం, పల్సి, చాత గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. క్యూలో నిల్చున్న రైతులు పదేళ్లలో ఎన్నడూ లేని కష్టాలు రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తున్నదని గట్టిగా అరుస్తూ పేర్కొన్నారు. చాలా మంది రైతులు తోపులాట జరగడంతో ఇంటికి వెనుదిరిగారు.

కొనడానికి క్యూలు.. అమ్మడానికి లైన్లు..
ఎరువులు, విత్తనాలు కొనడానికి క్యూలు కట్టాలి. పండించిన పంటలను అమ్ముకోవడానికి కూడా లైన్లలో నిలబడాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంది. కేసీఆర్ హయాంలో ఏనాడు ఎరువుల కొరత లేదు. క్యూలు లేవు. సోయా, శనగ, మక్కజొన్న పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనేందుకు సకాలంలో కేంద్రాలు ఏర్పాటు చేసేది. రైతులకు ఏలోటు లేకుండా చూసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. ఆయన చేసినంత మేలు ఎవరూ చేయరు. రేవంత్ సర్కారొచ్చి రెండేళ్లు పూర్తికాక ముందే.. రైతులు కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారు.
– పుప్పాల గంగాధర్, రైతు, కుభీర్.
అరుగు మీద నుంచి నామీద పడ్డరు..
ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారి అరుగు మీద నుంచి కింద పడి పోయా. నామీద ఎందరో మగవారు పడ్డారు. నా కాలు పాయే అంటూ అరుస్తున్నా ఎవ్వరు వినిపించు కోలేదు. గట్టిగా తొక్కడంతోనే నా కాలు మోకాలు వద్ద విరిగిం దని డాక్టరు చెప్పారు. ఇప్పుడు భైంసాకు వెళ్తున్నా. ఇట్టా ఎప్పుడు జరగలేదు. టోకెన్లు ఏమోగానీ నా ప్రాణం పోయేది. కానీ.. ఒక పద్ధతి లేదు పాడు లేదు. టోకెన్లు పద్ధతి ప్రకారం ఇస్తే ఇలా జరిగేది కాదేమో అని అనిపిస్తుంది.
– బత్తిని చంద్రకళ, మహిళా రైతు (కుభీర్ మండలం)
వైన్‌షాపుల మీది ప్రేమ.. కొనుగోలు కేంద్రాలపై లేదు..
కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్యం దుకాణాల ఏర్పాటు మీద ఉన్న ప్రేమ సోయా కొనుగోలు కేంద్రాలపై లేదు. మండలానికి రెండు మద్యం షాపులు కేటాయించారు. గ్రామగ్రామాన నాలుగైదు బెల్టు షాపులు ఉన్నాయి. కానీ.. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మాత్రం ఒకటే కేంద్రాన్ని తెరిచారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై చూపిస్తున్న కపట ప్రేమ. నిర్మల్ జిల్లాలోనే కుభీర్ పెద్ద మండలం. కావున కనీసం నాలుగు కేంద్రాలు తెరిచి సోయా పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయాలి.
– గుండోళ్ల శ్రీనివాస్, రైతు, కుప్టి.
రైతులను నట్టేట ముంచే కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నది. ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకపోతున్నాడు. అన్నం పెట్టే రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర లేదు. సగం రైతులు ఈ పాటికే దళారులకు సోయా అమ్మేశారు. రైతుబంధుకు దిక్కులేదు. కేసీఆర్ హయాంలో ఎన్నడూ ఇలా జరగలేదు.
– జాదవ్ దేవీదాస్, రైతు, పాంగ్రా.
రైతు వేదికల్లో టోకన్లు జారీ చేయాలి
కుభీర్ మండలంలో తొమ్మిది రైతు వేదికలను కేసీఆర్ హయాంలో నిర్మించారు. అందులో ఎక్కడి రైతులకు అక్కడ టోకన్లు జారీ చేస్తే ఈ బాధ ఉండదు. కుభీర్తోపాటు మాలేగాం, పల్సి, చాత గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించి రైతులకు అందుబాటులో కేంద్రాలు తెరిచే విధంగా చర్యలు చేపట్టాలి.
– దేశెట్టి కృష్ణయ్య, రైతు, కుప్టి.