దండేపల్లి, డిసెంబర్ 2 : ప్రభుత్వ అధికారుల తప్పిదం.. పట్టింపులేని తనంతో ఆ రెండు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోనున్నాయి. గతంలో నెల్కి వెంకటాపూర్లోనున్న వందుర్గూడను విడదీసి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నెల్కి వెంకటాపూర్‌లో అసలు గిరిజనులు లేకున్నా సర్పంచ్‌తో పాటు ఐదు వార్డు స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేయగా, ఇక్కడ ఎన్నికలు నిలిచిపోనున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాము కలిసే ఉంటామని, తమ గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఎన్నికలు వద్దం టూ వందుర్‌గూడ వాసులు తెగేసి చెబుతున్నారు. ఈ విషయమై ఆందోళనలు చేపడుతున్నా స్పందించే వారే కరువయ్యారని, ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమ సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
డిసెంబర్ 11న గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. సర్పంచ్ స్థానాలతో పాటు, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం నుంచి నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీలో నామినేషన్ల స్వీకరణ కేంద్రం ఏర్పాటు చేశారు. నామినేషన్ల చివరి రోజు వరకూ రెండు పంచాయలతీలకు ఒక్క నామినేషన్ కూడా రాలేదు. దీంతో మరోసారి నెల్కివెంకటాపూర్, వందుర్‌గూడ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోనున్నాయి. ఐదేళ్లపాటు పాలకవర్గం లేకుండానే పంచాయతీలు ఉండిపోనున్నాయని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు.
నెల్కివెంకటాపూర్ గ్రామంలో గిరిజనులు లేనందున ఏజెన్సీని తొలగించి ఎన్నికలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నెల్కివెంకటాపూర్ గ్రామంలో 2,830 జనాభా ఉంది. 1,763 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో వందుర్‌గూడ-నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీ కలిసి ఉండేది. వందుర్‌గూడలో ఉన్న గిరిజనులు సర్పంచ్ అభ్యర్థికి నామినేషన్ వేయడానికి ముందుకు వచ్చేవారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామం లో ఒక్క గిరిజనుడు కూడా లేడని గిరిజనులు మొత్తం వందుర్‌గూడ పంచాయతీలోనే ఉ న్నారని, తమ గ్రామాన్ని జనరల్‌గా ప్రకటిం చి ఎన్నికలు నిర్వహించాలనేది గ్రామస్తుల వాదన. ఒక్క గిరిజనుడు కూడా లేని గ్రామా న్ని ఎస్టీ రిజర్వ్ ఎలా చేశారని వారు మండిపడుతున్నారు. నెల్కివెంకటాపూర్ జీపీలో మొత్తం 750 మంది ఓటర్లుండగా, సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ మహిళకు కేటాయించారు. 10 వార్డులకుగాను 5 ఎస్టీలు, 5 జనరల్‌కు కేటాయించారు. 5 జనరల్ వార్డులకు కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో ఐదేళ్లపాటు సర్పంచ్ లేకుండానే ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ ఉండనున్నది.
గతంలో తాము నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీలో ఉన్నామని, అధికారులు విడదీసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారని తమను విడదీయవద్దని గ్రామస్తులు వాదిస్తున్నారు. అధికారులు తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే పంచాయతీగా విడగొట్టడం సబబు కాదంటున్నారు. కేవలం 198 మంది జనాభా, 163 మంది ఓటర్లున్న గ్రామాన్ని ఎలా విడదీస్తారంటూ వారు అధికారులను ప్రశ్నిస్తున్నారు. వందుర్గూడను నెల్కివెంకటాపూర్ పంచాయతీలో కలిపే వరకూ నామినేషన్ వేయమని చెబుతున్నారు. దీంతో ఇక్కడ ఎన్నికలు నిలిచిపోనున్నాయి.
ఇక్కడ 100 శాతం గిరిజనులు ఉండడంతో సర్పంచ్ స్థానంతో పాటు 8 వార్డులను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. పాత పంచాయతీలోనే కొనసాగాలని, ప్రత్యేక పంచాయతీ వద్దని గ్రామస్తులు గతంలో ఆందోళనలు చేశారు. నెల్కివెంకటాపూర్-వందుర్‌గూడ గ్రామాలను ఒకటే జీపీగా గుర్తించే విషయంలో పునఃపరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర న్యాయస్థానం స్థానిక అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిందని గ్రామ పెద్దలు అంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం దారుణమని, ఇప్పుడు మళ్లీ నోటిఫికేషన్ వేసి ఎన్నికలు నిర్వహిస్తే తాము ఒప్పుకోమని వారు అంటున్నారు.
వందుర్‌గూడ జీపీ విషయంలో అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపించారు. వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలి. అధికారుల తప్పిదం వల్ల ఇప్పటికే చాలా నష్ట పోయాం. రెండు జీపీలను కలిపి నోటిఫికేషన్ వెలువరిస్తేనే ఎన్నికలకు సహకరిస్తాం. గత ఎన్నికల నుంచి మా గూడెంలో నిధులు లేక అభివృద్ధి జరుగడం లేదు. ఇప్పటికే ఎన్నికలు బహిష్కరిస్తున్నామని తీర్మానం చేశాం. తీర్మానం కాపీలను అధికారులకు పంపించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీపీ విషయంలో మరోసారి ఆలోచించి మాకు న్యాయం చేయాలి.
– కోవ దౌలత్‌రావు మోకాశి(వందుర్‌గూడ గ్రామ పటేల్).