చెన్నూర్ టౌన్/దండేపల్లి, ఆగస్టు 4 : సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారం భం కానుండగా, ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటున్నది. పూజలు, పునస్కారాలు, వ్రతాలకు ఈ నెల పెట్టింది పేరు కాగా, ఇంటింటా సందడి నెలకొంటోంది. చెట్ల తీర్థాలు, వనభోజనాల పేరిట భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండగా, ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కిటకిటలాడే అవకాశమున్నది.
విశిష్టతల మాసం..
శ్రావణం.. ఆధ్యాత్మిక మాసం. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ మాసాన్ని శుభాల మాసం.. పండుగల మాసమనిని అంటారు. ముఖ్యంగా శ్రవణ నక్షత్ర ప్రవేశంతో వచ్చేదే శ్రావణ మాసం. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం.. శ్రీనివాసుడి జన్మ నక్షత్రం కూడా శ్రావణమే.. శ్రీకృష్ణుడు అవతరించింది శ్రావణ మాసంలోనే.. బలిచక్రవర్తికి పట్టాభిషేకం జరిగిన మాసం.. భక్తి మార్గాల్లో శ్రవణ భక్తి మొదటిది. శ్రవణ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజిస్తాడని ప్రతీతి. అందుకే శ్రావణ మాసం ప్రత్యేకతను సంతరించుకుంది.
సోమవారం..
ముక్తిప్రదాత శివుడికి ప్రీతికరమైన రోజు. సోమవారం శివుడిని పూజిస్తే శివకటాక్షాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. లింగస్వరూపుడైన శివుడిని పంచామృతాలతో అభిషేకించి బిల్వ పత్రం సమర్పిస్తే ఆయుష్షు పెరిగి..పాపాలు తొలగుతాయని నమ్మకం.
మంగళవారం
అభయమిచ్చే ఆంజనేయుడు.. సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు మంగళవారం జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలో ఆయా దేవతలను ఆరాధిస్తే వారు శుభాలను ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం.
బుధవారం
హరిహర సుతుడైన అయ్యప్పను బుధవారం కొలుస్తారు. శ్రావణ బుధవారాల్లో అయ్యప్ప పూజ విశేష ఫలితాన్నిస్తుందని పండితులు చెబుతారు. సర్వకార్య అనుకూలత, శివ కేశవుల కటాక్షం పొందేందుకు అయ్యప్పకు అభిషేకం చేయాలని సూచిస్తారు.
గురువారం
ఈ రోజు దక్షిణామూర్తిని కొలుస్తారు. అభిషేకం చేసి బిల్వపత్రం సమర్పిస్తే దక్షిణామూర్తి స్వామివారు సంతృప్తిచెందుతారని, పచ్చి శెనగల దండను సమర్పిస్తే కరుణా కటాక్షాలను వర్షిస్తాడని చెబుతారు.
శుక్రవారం
శ్రావణ శుక్రవారం వ్రతమాచరిస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. మంగళగౌరీ వ్రతం, మహాలక్ష్మీవ్రతం, ఆచరించేవారికి శ్రావణ శుక్రవారం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. అమ్మవారికి కుంకుమార్చనలు, ఎర్రని పూలు, అల్లిన మల్లెదండను సమర్పిస్తే సకల పాపాలు తొలగుతాయన్నది భక్తుల విశ్వాసం. రుణ విముక్తి, లక్ష్మీ కటాక్షం, సౌభాగ్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
శనివారం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కొలిస్తే కోరిన వరాలిస్తాడన్నది భక్తుల విశ్వాసం. ఆయనకు ప్రీతికరమైన రోజు శనివారం. స్వామివారికి పుష్పార్చన, తులసీమాల సమర్పిస్తే శుభం కలుగుతుందని పండితులంటున్నారు.
ఆదివారం
ప్రత్యక్ష భగవానుడు ఆదిత్యుడికి ప్రీతికరమైన రోజు. సూర్యుడు నమస్కార ప్రియుడు. ఆయనకు భక్తితో నమస్కరిస్తే కోరిన కోరికలు తీరుస్తాడని, ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు.
శ్రావణ మాసంలో వచ్చే పండుగలు.. :
శ్రావణమాసంలో మొదటి పండుగ మంగళగౌరీ వ్రతం. ఆ తర్వాత నాగ, గరుడ పంచమిలు, నారసింహ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ (జంధ్యాల), రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, గురు రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు, శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ నెలలోనే వస్తాయి. శ్రావణ సోమవారాలు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మంగళగౌరీ వ్రతం
ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ముత్తయిదువలు, పెండ్లికాని యువతులు ఆచరించే మంగళగౌరీ వ్రతం అత్యంత విశేషమైంది. అమ్మవారిని షోడశోపచారాలతో, అష్టోత్తర శతనామాలతో పూజిస్తారు. పసుపు, బంగారం, వెండితో గౌరమ్మను పూజిస్తే సుఖ సంపదలు వస్తాయని నమ్మకం. పెండ్లికాని వారికి వివాహం అవుతుందని ప్రగాఢ విశ్వాసం. చివరి వారంలో పసుపు, కుంకుమలతో వాయినాలు సమర్పించుకుంటారు.
నాగుల పంచమి
శ్రావణ శుద్ధ చవితి, పంచమి రోజున నాగుల చవితి, పంచమిని జరుపుకుంటారు. ఈ రెండు రోజులతో పాటు, శ్రావణ శనివారాల్లో పెద్దలు, పిల్లలు పుట్టలో పాలుపోసి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తారు. నాగముద్రికలను సమర్పించుకుంటారు. ఇలా చేస్తే సర్వ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
వరలక్ష్మీ వ్రతం
నిత్య సౌభాగ్యం కోసం మహిళలు ఆచరించే వ్రతాల్లో వరలక్ష్మీ వ్రతం ఒకటి. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రత్యేకంగా అమ్మవారికి కుంకమార్చనలు చేస్తారు. అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లేలా చూడాలని అమ్మవారిని కోరుకుంటారు.
శ్రావణ పూర్ణిమ
శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అంటారు. రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమిగా జరుపుకుంటారు. ఇదే రోజున హయగ్రీవ, సంతోషీమాత జయంతి కూడాకావడం విశిష్టత. మాతను ఆరాధించడం ద్వారా సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయన్నది హిందువుల నమ్మకం.
శ్రీకృష్ణాష్టమి
శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడి జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఒక్క కృష్ణాష్టమి వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తే సంవత్సరంలో 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున పల్లె, పట్టణాల్లో ఉట్టి సంబురాలు, చిన్నారులను గోపికలు, చిన్ని కృష్ణులుగా అలంకరించి మురిసిపోతారు.
మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం
శ్రావణమాసం మహావిష్ణువు, ఆయన సతీమణి మహాలక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతి కరమైన మాసంగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ నెలలో వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది. శ్రావణం అందరికీ ప్రీతిపాత్రమైనది. మంచిరోజులు కావడంతో శుభకార్యాలు అధికంగా నిర్వహిస్తుంటారు.
– వేమారపు మహేశ్వర శర్మ, అర్చకుడు, చెన్నూర్