దండేపల్లి, నవంబర్12 : దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట కార్తీక శోభను సంతరించుకున్నది. ఇక్కడి సత్యనారాయణస్వామి, అయ్యప్పస్వామి, షిర్డీసాయిబాబా, ఆంజనేయస్వామి దేవస్థానం, శనేశ్వరాల యం, సదానందస్వామి ఆలయాలకు ఎంతో విశిష్టత ఉంది. యేటా కార్తీక మాసం పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని, సామూహిక వ్రతాలు ఆచరిస్తారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచేగాక ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు పక్క రాష్ర్టాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. అలాగే మాఘమాసంలో ఏడురోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణం నిర్వహిస్తారు.
నేటి నుంచి ప్రత్యేక కార్యక్రమాలు
సత్యనారాయణ స్వామి ఆలయంలో నేటి నుంచి 15వ తేదీ వరకు కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించనున్నారు. 13న విశ్వక్సేణ ఆరాధన, పుణ్యహవాచనము, అంకురారోపణము, అగ్రి ప్రతిష్ఠ, నిత్యవహణము, బలిహరణం, తీర్థప్రసాద వితరణ, గోధూళిక సుముహూర్తాన తులసీ కల్యాణం 14న నిత్యహవణము, బలిహరణము, తీర్థప్రసాద వితరణ, 15న నిత్యహవణము, బలిహరణము, తీర్థప్రసాద వితరణ, కార్తీక పౌర్ణమి జాతర,సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు, మహా పూర్ణాహుతి, హోమంవంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.