మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నందిగుండం దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 6 : ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మల్ జిల్లా వర్ధిల్లుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నందిగుండం దుర్గామాత ఆలయ వార్షికోత్సవానికి విచ్చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు సంవత్సరాల్లోనే నందిగుండం దుర్గామాత ఆలయాన్ని రూ.1.50 కోట్లతో అద్భుతంగా నిర్మించామన్నారు. ఇటీవల గాలిగోపుర నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. కాళికామాత ఆలయాన్ని రూ.50 లక్షలతో నిర్మిస్తున్నామని తెలిపారు. నందిగుండం ప్రదేశంలో 12 ఎకరాల అటవీ శాఖ భూమిని ఆలయానికి ఇవ్వనున్నామని ఈ ప్రక్రియ త్వరలో పూర్తి కానునందని పేర్కొన్నారు. పక్కనే గల గండిరామన్న దత్తసాయి ఆలయం అభినవ షిర్డీగా రూపుదిద్దుకుందని ఇప్పటి వరకు రూ.కోటి 50 లక్షలతో అభివృద్ధి చేశామన్నారు. అనంతరం ఆలయ గోపుర నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి వెంట డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఆలయ అధ్యక్షుడు లక్కాడి జగన్మోహన్ రెడ్డి, ఆలయ వ్యవస్థాపకుడు వెంకటాచారి, నాయకులు పూదరి నరహరి, ఈఈ రామారావు ఉన్నారు.
భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరం
ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గాన కోకిల లతా మంగేష్కర్ భారతీయ సంగీతానికి దేవుడిచ్చిన వరమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో లతా మంగేష్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లతా మంగేష్కర్ మృతి చాలా బాధాకరమని, సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. పాట ద్వారా ఆమె ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటుందన్నారు. కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు రాము, కౌన్సిలర్లు వేణు, గండ్రత్ రమణ, నవీన్, పూదరి రాజేశ్వర్, నాయకులు పొశెట్టి, పద్మాకర్ పాల్గొన్నారు.