వాంకిడి : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ (Asifabad Collector) వెంకటేష్ దోత్రే (Venkatesh Dotre) అన్నారు. శుక్రవారం ప్రధానమంత్రి శ్రీ పథకంలో భాగంగా ఎంపికైన వాంకిడి మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ ( Kasturba Gandhi) బాలికల విద్యాలయంలో పాఠశాల అదనపు తరగతుల నిర్మాణ స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారితో కలిసి పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా వాంకిడి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో రూ. 3. 25 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి స్థలం సరిపోవడం లేదని మండల ప్రత్యేక అధికారి, మండల విద్యాధికారి శివచరణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ వెంట ఆర్డీవో లోకేశ్వరరావు,ఎంపీడీవో, తహసీల్దార్, మండల పంచాయతీ అధికారి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.