బజార్హత్నూర్, ఫిబ్రవరి 26 : పల్లెలు అభివృద్ధి చెందాలంటే గ్రామస్తులే కీలకం. వారు చెల్లించే పన్నులతో గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయి. గ్రామాల్లో మౌళిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న 14, 15వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధులతో పాటు గ్రామాల్లోని ఇంటి, వాణిజ్య సముదాయాలు చెల్లించే పన్నులు కీలకంగా మారుతాయి. ప్రజలకు వసతులు కల్పించాలంటే ఇందుకు అవసరమైన నిధులను గ్రామాల్లో ఏటా ఇంటి పన్నులు వసూలు చేయడం తప్పనిసరిగా భావిస్తున్నారు. ఇంటి పన్ను వందశాతం వసూలు చేయాలని పంచాయతీ సిబ్బంది నిర్ణయించారు. ఇప్పటికే బజార్హత్నూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే 79 శాతానికి పైగా పూర్తి చేశారు.
30 జీపీల్లో ముమ్మరంగా వసూళ్లు
బజార్హత్నూర్ మండలంలో 30 పంచాయతీలున్నాయి. గత ఆర్థిక సంవత్సరం 100 శాతం పన్నులు వసూలు చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి 31వ తేదీతో ముగియనుండడంతో గ్రామాల్లో ఇంటి పన్నుల వసూలుపై పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇప్పటికే 79 శాతానికిపైగా వసూలు చేశారు. బోస్రా, ధరంపురి, కిన్నెరపల్లి, మాన్కాపూర్, రాంపూర్ గ్రామాల్లో 100 శాతం వసూళ్లు పూర్తయ్యాయి. కాగా, అందుగూడ, గిరిజాయి 99 శాతం, అనంతపూర్, భూతాయి(కే), చింతల్సాంగ్వి, డేడ్రా గ్రామాల్లో 96 శాతం వసూలయ్యాయి. మండలంలో ఈ ఏడాది రూ.24,86,791 వసూళ్లు ఉండగా అందులో నుంచి గత ఏడాది బకాయి రూ.48,974 కలుపుకొని మొత్తం రూ.25,35,765 ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.20,06,477 వసూలయ్యాయి. ఇంకా రూ.5,29,288 వసూలు కావాల్సి ఉంది. ఈ ఏడాది మండలంలోని అన్ని గ్రామాల్లో 100 శాతం పన్ను వసూలుకు ప్రజాప్రతినిధుల సహకారంతో అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి ఇంటి పన్ను వసూలుకు కృషి చేస్తున్నారు.
ఇంటి పన్ను వసూళ్లలో వెనుకంజలో ఉన్న జీపీలు భూతాయి 31శాతం, చందునాయక్తండా 32 శాతం, దిగ్నూర్ 35 శాతం, బజార్హత్నూర్ 70శాతంతో వెనుకంజలో ఉన్నాయి.
ఇంటి పన్ను చెల్లించి సహకరించాలి
గ్రామాల్లో పేరుకపోయిన ఇంటి పన్ను వసూలుకు ప్రజలు సహకరించాలి. ఇప్పటికే ఐదు పంచాయతీల్లో 100 శాతం పూర్తి చేశాం. మరో కొన్ని పంచాయతీల్లో 90 నుంచి 99 శాతం వరకు పూర్తయ్యాయి. ఈనెలాఖరు వరకు మిగిలిన పంచాయతీల్లో స్పెషల్డ్రైవ్తో 100శాతం పూర్తి చేస్తాం. ప్రజలు చెల్లించే డబ్బులతోనే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతాం. ప్రజలు పన్నులు చెల్లించి అధికారులకు సహకరించాలి. పన్నులు చెల్లిస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యం.
– మహేందర్రెడ్డి, ఎంపీవో