
నార్నూర్,డిసెంబర్16: జనజీవన శ్రేయస్సే లక్ష్యంగా హరితహారం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం దిగ్విజయంగా అమలు చేస్తున్నది. నాటిన ప్రతి మొక్కా బతకాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దీనికోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. మొక్కల కోసం సంరక్షక్షులను నియమిస్తోంది.
ఉపాధిహామీ పథకంలో భాగంగా గతంలో ఏటా లక్షల కొద్ది మొక్కలు నాటేవారు. అయితే వాటిని సంరక్షించేవారు లేక మొక్కలు చనిపోయేవి. ఫలితంగా ఏటా రూ.కోట్లా ప్రజాధనం వృథా అయ్యేది. దీనిని గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పథకం లక్ష్యం నీరుగారకూడనే ఆశయంతో పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. నర్సరీల నుంచి మంచి మొక్కలను తీసుకురావడం,లోతుగా గుంతలు తీసి పూడ్చడం, మొక్కలకు రక్షణ కల్పించడం,నీటి సదుపాయం వంటి అన్ని చర్యలనూ పక్కాగా అమలు చేస్తోంది.
నర్సరీల నుంచి మొక్కలు…
హరితహారం పథకంలో భాగంగా నార్నూర్,గాదిగూడ ఉమ్మడి మండలంలోని 166కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా,చెరువు కట్టలు,ఖాళీ ప్రదేశాలలో ఉపాధిహామీ పథకం ద్వారా మొక్కలను నాటారు. కిలోమీటరుకు 400 చొప్పున 5,50,200మొక్కల పెంపకం చేపట్టారు. వీటిని అధిక భాగం జిల్లా పరిధిలోని నర్సరీల నుంచి తెప్పించారు. మూడు అడుగుల కన్నా పెద్ద మొక్కలను తేవడంతో నాటిన తర్వాత చనిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంది. సాధారణంగా మొక్కలను వర్షాకాలంలో నాటుతారు. డిసెంబర్ నుంచి వాటికి నీటి సదుపాయం తగినంత ఉండదు. ఉపాధి కూలీలు కూడా ఇతర పనుల్లో నిమగ్నం కావడంతో వాటి సంరక్షణ సక్రమంగా జరగదు. ఈ నేపథ్యంలో 60 శాతం మొక్క లు బతకడం కూడా కష్టంగా ఉండేది. ఈ ఏడాది దీనిని అధిగమించేందుకు ప్రత్యేకంగా కూలీలను నియమించారు.
ప్రతి మొక్కకు ఏడాదికి 40సార్లు నీటి సదుపాయం…
హరితహారం ద్వారా నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రతి కిలోమీటరు లేదా కనీసం 200మొక్కలకు ఒకరు చొప్పున సంరక్షక్షులను నియమించారు. ఉమ్మడి మండల మొత్తంలో 166మంది మొక్కల సంరక్షక్షులు పని చేస్తున్నారు. వీరికి ఒక్కో మొక్కకు నెలకు రూ.10చొప్పున కూలీ రూపంలో అందజేస్తారు. మొక్కల పొదులను శుభ్రం చేయడ ం,చుట్టూ కంచె వేయడం చేయాలి. ఏడాదికి 40సార్లు మొక్కలకు నీటి సదుపాయం కల్పించేందు ఒక్కో మొక్కకు రూ.160వేతనం రూపంలో చెల్లించనున్నారు. ఉమ్మడి మండ లంలోని 48ట్యాంకర్లు ఏర్పాటు చేసి నీటి సదుపాయాన్ని కల్పిస్తున్నారు. మరోవైపు చీడపీడల నుంచి రక్షించుకోవడానికి,మొక్కల పెంపకానికి మందులను వాడుతున్నారు.
93శాతం మొక్కలు సజీవం…
ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల మొత్తంలో సుమారు 5వేల మొక్కలు నాటాం.అందులో 93శాతం మొక్కలు బతికే ఉన్నాయి. చనిపోయిన వాటి స్థానంలో మరోసారి మొక్క లు నాటి ఆరోగ్యంగా ఉంటేనే వేతనదారులకు బిల్లులు చెల్లిస్తున్నాం. వందశాతం మొక్కలను బతికించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం.
రమేశ్(ఎంపీడీవో నార్నూర్)