ఆదిలాబాద్, మే 22(నమస్తే తెలంగాణ) : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మార్కెట్ యార్డుల్లో జొన్న పంట తడిసింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కండ్ల ఎదుట తడిసిపోతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. సాత్నాల మండలంలోని మేడిగూడలో ఆరుబయట ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వర్షం కారణంగా జొన్నలు తడిశాయి. కొనుగోలు చేసిన పంటను సంచుల్లో నింపగా లారీలు రాకపోవడంతో సంచులు తరలింపులో జాప్యం జరుగుతున్నది. దీంతో పీఏసీఎస్ సిబ్బంది తడిసిన సంచులను ఎండబెట్టమని రైతులకు సూచిస్తున్నారు. రాత్రి, పగలు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నామని రైతులు అంటున్నారు. మాడు రోజులు వర్షం ఉండడంతో పంటను కొనుగోలు చేసి బస్తాలను గోదాములకు తరలించి తాము నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
నేను 45 క్వింటాళ్ల జొన్నలను అమ్మడానికి మేడిగూడ సెంటర్కు తీసుకొచ్చి ఐదు రోజులు అవుతున్నది. గురువారం నాటికి కూడా పంటను కొనుగోలు చేయడం లేదు. 19వ తేదీన పంట నాణ్యత పరిశీలించి పాసింగ్ చేశారు. ఎందుకు కాంటా చేయడం లేదని పీఏసీఎస్ సిబ్బందిని అడిగితే గన్నీ సంచులు(బార్దాన్) లేవని అంటున్నారు. సంచులు ఈ రోజు వస్తాయి, రేపు వస్తాయి అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వర్షం పడుతుండడంతో పంట తడిసిపోతున్నది. పైన కవర్లు కప్పినా.. కింద నుంచి నీళ్లు వచ్చి నష్టం జరుగుతుంది. అధికారులు స్పందించి పంటను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.
– రాకేశ్, రైతు, మేడిగూడ, సాత్నాల
నేను 70 క్వింటాళ్ల జొన్నలను అమ్మకానికి వారం రోజుల కిందట తీసుకొచ్చా. సగం పంటను కొనుగోలు చేసిన సిబ్బంది సంచుల లేవని మిగతా పంటను కొనడం లేదు. మొత్తం పంటను తీసుకోమని అడిగితే బరాదాన్(గన్నీ సంచులు ) లేవని అంటున్నారు. పంటకు కాపలాగా కొనుగోలు కేంద్రంలో ఉండాల్సి వస్తున్నది. లారీలు రాకపోవడంతో నింపిన సంచులను తీసుకుపోవడం లేదు. బుధవారం కురిసిన వర్షంతో పంట నింపిన సంచులు తడిసిపోయాయి. వాటిని ఆరబెట్టి వేరే సంచుల్లో నింపమని కొనుగోలు కేంద్రాల సిబ్బంది సూచిస్తున్నారు. దీంతో కూలీలకు డబ్బులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. అధికారులు స్పందించి పంట కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలి.
– భూమారెడ్డి, రైతు, మేడిగూడ, సాత్నాల మండలం