శ్రీరాంపూర్, మే 21 : రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణిలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ సత్ఫలితాన్నిస్తోంది. పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్‌లో.. వినియోగించబడని కరెంట్‌ను గ్రిడ్‌కు సరఫరా చేయకుండా, బ్యాటరీలోనే నిల్వ చేసుకొని అవసరమైనప్పుడల్లా వాడుకునే వీలున్నది. నాలుగు నెలల క్రితం మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌కు అనుబంధంగా మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్‌ను నెలకొల్పగా, ఇందు కోసం రూ. 2.5 కోట్లు యాజమాన్యం వెచ్చించింది.
ప్రభుత్వం సౌర విద్యుత్‌కు అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని సింగరేణితో సహా పలు రాష్ట్ర సంస్థలు సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి సంస్థ ఇప్పటికే 8 చోట్ల 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటిలో 147 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఓపెన్ యాక్సెస్ ప్లాంట్లుగా, మిగిలిన 98.50 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను ఇన్ హౌస్ ప్లాంట్లుగా గుర్తించి తెలంగాణ విద్యుత్ గ్రిడ్లకు అనుసంధానం చేసింది. ఈ ఇన్ హౌస్ ప్లాంట్ల విద్యుత్‌ను కూడా తెలంగాణ విద్యుత్ శాఖ గ్రిడ్లకు అనుసంధానం చేసినప్పటికీ, ఒప్పందం ప్రకారం ఇకడ స్థానిక అవసరాలకు వాడగా, మిగిలిన విద్యుత్‌కు మాత్రం తెలంగాణ డిసమ్ ఎలాంటి చెల్లింపులు చేయదు. మిగులు విద్యుత్‌ను ఉచితంగానే గ్రిడ్‌కు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇన్ హౌస్ ప్లాంట్ల నుంచి రోజుకు వేలాది యూనిట్ల మిగులు విద్యుత్‌ను ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా గ్రిడ్‌కు సరఫరా చేయడం జరుగుతోంది. ఈ మిగులు విద్యుత్‌ను కూడా సొమ్ము చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశం మేరకు సింగరేణి సంస్థ రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక మెగావాట్ సామర్థ్యం గల బీఈఎస్ఎస్ను మందమర్రి ప్లాంట్‌లో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది.
మందమర్రిలో గల 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ సమర్థంగా పనిచేస్తూ మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లోని గనులు, కాలనీలకు అవసరమైన విద్యుత్‌ను అందిస్తున్నది. అయితే, స్థానిక విద్యుత్ అవసరాలకు సరిపోగా, ఇంకా కొంత విద్యుత్ మిగిలిపోతున్నది. ఈ నేపథ్యంలో మందమర్రి ప్లాంట్‌లో జనవరిలో బ్యాటరీ ఎనర్జీ స్టోరీ సిస్టమ్‌ను సింగరేణి ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ బీఈఎస్ఎస్ యూనిట్ స్థానిక అవసరాలకు వినియోగించగా, మిగిలిన 3,35,485 యూనిట్ల విద్యుత్‌ను నిల్వ చేసుకొని అవసరమైన సందర్భంలో వినియోగించుకుంటున్నది. తద్వారా సింగరేణి సంస్థకు రూ. 25,66,460 ఆర్థిక లబ్ధి చేకూరింది. ఒక మెగావాటు సామర్థ్యం గల బీఈఎస్ఎస్ యూనిట్ ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్‌ను ఆదా చేయడం విశేషం. ఇకడ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బీఈఎస్ఎస్ విజయవంతం కావడంపై సింగరేణి యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తున్నది. పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు యాజమాన్యం ప్రకటించింది.