మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 24 : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు సాగుతున్నాయి. రాంచెరువు మత్తడి కాలువ పక్కన భవనాలు కట్టుకున్న యజమానులు.. ఏకంగా ఆ కాలువపైనే స్లాబులు నిర్మించుకొని తమ ఇళ్లకు వెళ్లేలా దర్జాగా దారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. యేటా వర్షాకాలంలో జన్మభూమినగర్, హైటెక్ కాలనీల మధ్యనున్న రాంచెరువు నుంచి మత్తడి ద్వారా భారీగా వరద వెళ్తుంది.
గతంలో ఈ మత్తడి ద్వారా వచ్చే వరదంతా నివాస ప్రాంతాల్లోకి వెళ్లగా, అందుకు శాశ్వత పరిష్కారంగా సుమారుగా 20 అడుగుల వెడల్పుతో రాంచెరువు నుంచి జన్మభూమినగర్, గౌతమీనగర్, ఇస్లాంపుర, రాళ్లపేట, రెడ్డికాలనీల మీదుగా రాళ్లవాగు వరకు మత్తడి కాలువ నిర్మించారు. అయితే, గౌతమీనగర్, ఇస్లాంపుర ప్రాంతాల్లో అక్కడక్కడా కాలువ వెడల్పు తగ్గింది. తాజాగా రాళ్లపేట, రెడ్డికాలనీల మధ్య పలువురు నిర్మించిన భవనాలకు ముందు ఉన్న కాలువపై స్లాబులు నిర్మిస్తున్నారు.
గతంలో జన్మభూమినగర్ ఏరియాలో కమర్షియల్ బిల్డింగ్‌లకు ముందున్న కాలువపై ఎవరికి వారు వంతెనలు నిర్మించుకున్నారు. ప్రస్తుతం బైపాస్‌రోడ్డులో కాలువ పక్కనున్న స్థలాల్లో భవనాలు నిర్మించుకున్న వారు.. తమ ఇళ్లకు వెళ్లేలా ఆ కాలువపై స్లాబులు నిర్మిస్తున్నారు. పలువురు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు ఉంటున్నారు. ఈ విషయాన్ని కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారి సంపత్ దృష్టికి తీసుకెళ్లగా, తమ సిబ్బందిని పంపి తగిన చర్యలు తీసుకుంటానన్నారు.