మంచిర్యాల, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసే అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి బల్దియాలకు వచ్చే ఆస్తి పన్ను బకాయిలపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏండ్లకేండ్లు కోట్లలో పేరుకుపోతున్నా, సేకరించడంలో విఫలమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెలలో వసూలు చేసిన ఆస్తిపన్నుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలకు ఆదాయం పెరిగింది. జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు రూ.58.90 కోట్లు పన్నుల రూపంలో సమకూరాయి. సాధారణంగా పురపాలికలకు నల్లా పన్ను, దుకాణాల అద్దె, వర్తక పన్ను, వాణిజ్య ప్రకటనలపై వచ్చే ఆదాయం కన్నా.. ఆస్తిపన్ను రూపంలో వచ్చే ఆదాయమే ఎక్కువ.
అందుకే సకాలంలో పన్ను కట్టకపోతే ఎక్కడ మెలిక పెట్టాలో అక్కడ పెట్టి మరీ వసూలు చేస్తారు. ఎందుకంటే మున్సిపాలిటీల ఖర్చులు దీనిపైనే ఆధారపడి ఉంటాయి. ఒక్క ఏడాది పన్ను వసూలు కాకుండా బకాయిలు పేరుకపోయాయా.. ఇక అంతే సంగతులు. అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో పాటు బిల్లుల చెల్లింపులు, సిబ్బంది, కార్మికుల వేతనాలు కష్టమైపోతాయి. అందుకే మొండి బకాయిల విషయంలో అధికారులు, సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తుంటారు.
ఇటీవల నిర్మల్ జిల్లాలో పన్ను బకాయిలున్న ఇండ్ల గేట్లను మున్సిపాలిటీ వాళ్లు తీసుకెళ్లిపోయారు. ఖాళీ స్థలాలు ఉండి మొండి బకాయిలుంటే స్థలం అమ్ముకునేప్పుడో, ఇంటి నిర్మాణ సమయంలోనే పర్మిషన్‌కు ఆస్తి పన్నుకు మెలికపెట్టి మరీ వసూలు చేస్తుంటారు. అందుకే ఉమ్మడి జిల్లాలో రూ.100.29 కోట్ల లక్ష్యంలో దాదాపు 60శాతం వసూళ్లు చేయగలిగారు. ఇక్కడికి వరకు బాగానే ఉన్నా ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన పన్నులు మాత్రం మున్సిపాలిటీలకు రాకపోవడం గమనార్హం.
సాధారణ జనాలు పన్నులు కట్టని పక్షంలో కఠినంగా వ్యవహరించే అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే సరికి మాత్రం ఏం చేయలేకపోతున్నారు. ఏండ్లకేండ్లు ఆస్తి పన్ను బకాయిలుంటున్నా, వసూలు చేయడంలో విఫలమవుతున్నారు. ఉమ్మడి జిల్లాకు ఉన్న రూ.100.29 కోట్ల లక్ష్యంలో వసూలైన మొత్తం తీసేస్తే ఇంకా రూ.41.39 కోట్లు కట్టాల్సి ఉంది. ఈ బకాయిల్లో 40 శాతం అంటే రూ.16.17 కోట్లు ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సి ఉండగా, రూ.5.77 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ. 10 కోట్ల పైచిలుకు పన్నులు వసూలు కాలేదు. ఇవన్నీ ఈ ఒక్క ఆర్థిక సంవత్సరానికి కాదు.. ఏండ్లకు ఏండ్లుగా కట్టకుండా పేరుకుపోయిన బకాయిలే.
సింగరేణి సంస్థ రూ.1.10 కోట్లు నస్పూర్ మున్సిపాలిటీకి బకాయిపడింది. అత్యధికంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 756 ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.8.49 కోట్ల పన్నులు రావాల్సి ఉండగా, ఈ ఏడాది రూ.4.38 కోట్లు వసూలయ్యాయి. నిర్మల్ మున్సిపాలిటీకి ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.3 కోట్లు రావాల్సి ఉండగా, రూ. 50 లక్షలు, మంచిర్యాల మున్సిపాలిటీకి రూ.1.83 కోట్లకు రూ.12.37 లక్షలు మాత్రమే వచ్చాయి. ఇలా ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీల్లో ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.5.77 కోట్ల పన్నులు మాత్రమే వసూలు అయ్యాయి. ఒక్క క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఎలాంటి బకాయిలు లేవు.
పన్నుల వసూళ్లలో తెలంగాణ రాష్ట్ర సగటు 70.34శాతంగా ఉండగా, ఉమ్మడి జిల్లాలో ఈ మార్క్‌ను కేవలం రెండు మున్సిపాలిటీలు మాత్రమే దాటగలిగాయి. లక్షెట్టిపేట మున్సిపాలిటీ రికార్డు స్థాయిలో 91.44 శాతం పన్నులు వసూలు చేసింది. రాష్ట్రంలోనే ఈ మున్సిపాలిటీ టాప్-8లో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో లక్షెట్టిపేట మొదటిస్థానంలో ఉండగా, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ 80.17శాతంతో రెండో స్థానంలో ఉంది. మన జిల్లాలోని భైంసా 47.29 శాతంతో రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది. మంచిర్యాల 68.45 శాతం, ఆదిలాబాద్ 64.23 శాతం, కాగజ్‌నగర్ 58.16, నస్పూర్ 56.52, చెన్నూర్ 55.94, నిర్మల్ 53.24, మందమర్రి 53.20, బెల్లంపల్లి 50.79 మాత్రమే 50 శాతం మార్కును దాటి ఆస్తిపన్నులు వసూలు చేయగా, ఖానాపూర్ మున్సిపాలిటీ 49.06శాతం పన్నులు వసూలు చేసింది.
ఆస్తి పన్ను వసూలు కోసం మార్చి 31వ తేదీ డెడ్‌లైన్ పెట్టుకొని పనిచేశాం. విస్తృత ప్రచారం నిర్వహించడం, బకాయిలు తగ్గించేందుకు వడ్డీ మీద 90శాతం రాయితీ ఇవ్వడం కలిసి వచ్చింది. చాలా మంది ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. మంచిర్యాలలో 68.45 శాతం పన్నులు వసూలయ్యాయి. ఇంకా కట్టనివాళ్లు ఎవరైనా ఉంటే వెంటనే కట్టాలి.
మొండి బకాయిలు ఎప్పటికైనా ప్రమాదకరమే. బకాయిల వసూళ్లపై దృష్టి సారించాం. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మొండి బకాయిల విషయంలో తగిన చర్యలు తీసుకుంటాం. ఎర్లీబర్డ్ స్కీమ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్‌గా ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ వర్తిస్తుంది. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకొని, ముందస్తు పన్నులను 5 శాతం రాయితీతో చెల్లించాలి.
– ఏ. మారుతి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్, మంచిర్యాల