సీసీసీ నస్పూర్: గోదావరి కాలనీలో ఏర్పాటుచేసి మూసివేసిన సింగరేణి సూపర్ బజార్‌ను ( Singareni Super Bazaar) వెంటనే ప్రారంభించాలని హెచ్ఎంఎస్ (HMS ) కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పారపు సారయ్య, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సీసీసీలోని యూనియన్ ఆఫీస్ వద్ద మాట్లాడుతూ సూపర్ బజార్ మూసి వేయడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
గతంలో సూపర్ బజార్లో వస్తువులు సరిగా లేక కార్మికులు డీమార్ట్( D Mart ) , రిలయన్స్, తదితర ప్రైవేట్ సూపర్ బజార్లను ఆశ్రయించారని, ఇప్పుడు సూపర్ బజార్ ను పూర్తిగా మూసివేయడంతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న దాదాపు 9,400 మంది కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.
సింగరేణి యాజమాన్యం సూపర్ బజార్లపై చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు. పేరుకే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని యాజమాన్యం గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. గుర్తింపు సంఘం ఏఐటీయుసీ యూనియన్ కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సూపర్ బజార్ సేవలను పున ప్రారంభించాలని డిమాండ్ చేశారు.