సీసీసీ నస్పూర్, ఆగస్టు 19 ః ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. యంగ్ ఇండి యా స్కిల్ యూనివర్సిటీ పేరిట ప్రభుత్వం 97జీవోను తీసుకొచ్చింది. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని, వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీసీసీ నస్పూర్‌లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు. కళాశాల వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం అక్కడి నుం చి సీసీసీ కార్నర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్నర్ వద్ద నిరసన చేపట్టారు. విద్యార్ధుల ఆం దోళనకు పీడీఎస్‌యూ, ఏఐఎస్బీ, ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన తర్వాత ఇంజినీరింగ్‌లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులు.. ప్రభుత్వం తాజా నిర్ణయంతో మళ్ళీ ఇంటర్మీడియట్ చదవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్ధుల భవిష్యత్‌తో ప్రభుత్వం చెలగాటమాడొద్దని, జీవో 97ను వెంటనే రద్దు చేయాలని, డిప్లొమా విద్యను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు డీకొండ జతిన్గౌడ్, కనుకుంట్ల సన్నీగౌడ్, సికిందర్, కార్తీక్, విష్ణుప్రసాద్ పాల్గొన్నారు.
బెల్లంపల్లి, ఆగస్టు 19 : పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ఎస్బీటీఈటీ పరిధిలోనే కొనసాగించాలని బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులతో బుధవారం బెల్లంపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రాలో అమలు చేసిన విధానాలు తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థులపై రుద్దే యత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడే జీవో 97ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేసే నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనంపై విద్యార్థులు, అధ్యాపకులు, విద్యా నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్బీటీఈటీని బలోపేతం చేయాల్సింది పోయి, దాని పరిధిని మార్చే ప్రయత్నాలు చేయడం విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో 97ను ఉపసంహరించుకోవాలని కోరారు. జీవో 97 రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను పరిధిలోనే కొనసాగించే వరకు విద్యార్థుల పక్షాన నిలబడి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు మురుకురి శ్రావణ్, నాయకులు రియాజ్, అరుణ్, సుమంత్, రాంచరణ్ పాల్గొన్నారు.